అమెరికాను దాటేయనున్న చైనా
భారత్ గత కొంత కాలంగా ఛైనా పై ఆధారపడటం తగ్గించుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ దిశగా చర్యలు కూడా ప్రారంభించింది. అయితే ఇది అంత వేగంగా సాధ్యంకాకపోవచ్చని..ఇందుకు చాలా సమయం పడుతుందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. దీనికి పక్కా, దీర్ఘకాలిక వ్యూహం ఉంటేనే భారత్ దిగుమతులను తగ్గించుకోగలదని అంచనాలు ఉన్నాయి. ఈ తరుణంలో కీలక విషయం ఒకటి వెలుగు చూసింది. అదేంటి అంటే 2028 నాటి చైనా ప్రస్తుతం అగ్రరాజ్యంగా ఉన్న అమెరికాను దాటేస్తుందని. 2028 నాటికి చైనా ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరిస్తుందని యూకెకు చెందిన సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రిసెర్చ్ వెల్లడించింది. గతంలో అంచనా వేసిన దాని కంటే ఐదేళ్ళు ముందుగానే చైనా ఈ దిశగా పయనించనుంది.
కోవిడ్ 19 మహమ్మారి ప్రపంచంలోని ఆర్ధిక వ్యవస్థలు అన్నింటిని అతలాకుతలం చేసినా చైనాపై మాత్రం ఈ ప్రభావం చాలా తక్కువగానే ఉంది. ఇది కూడా చైనా వేగంగా వృద్ధి సాధించటానికి ఓ కారణం కాబోతుంది. ఇదిలా ఉంటే భారత్ మాత్రం 2030కి ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా మారుతుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ప్రపంచంలో ఆర్ధికంగా అత్యంత శక్తివంతమైన దేశాలే ప్రపంచంలో పలు అంశాలపై పెత్తనం చెలాయిస్తుంటాయి. ఈ తరుణంలో ఆర్ధికంగా చైనా నెంబర్ స్థితికి చేరుకుంటే పలు అంశాల్లో భారత్ కు చికాకులు తప్పవనే అంచనాలు ఉన్నాయి.