Telugu Gateway
Top Stories

ఏఐ వీడియో లతో సోషల్ మీడియా లో ప్రచారం

ఏఐ వీడియో లతో సోషల్ మీడియా లో ప్రచారం
X

మైక్రో సాఫ్ట్ సంచలన నివేదిక

బీజేపీ మరో సారి కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన రంగం సిద్ధం చేసుకుంటోంది. అధికారంలోకి అంటే మళ్ళీ అలా ఇలా కాదు ఏకంగా 400 సీట్లతో అధికారంలోకి వస్తామని ప్రధాని మోడీ తో పాటు బీజేపీ కీలక నేతలు అందరూ చెప్పుకుంటున్నారు. ఈ ప్రచారాన్ని వ్యూహాత్మకంగా చేస్తున్నారు అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో లేకపోలేదు. మరో వైపు బీజేపీ నేతలు చెప్పుకుంటున్నట్లు క్షేత్ర స్థాయిలో ఆ పార్టీ కి అనుకూల వాతావరణం లేదు అన్నది మరి కొంత మంది వాదన. మరో వైపు కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ కూడా మీడియా లో ప్రచారం జరుగుతున్నట్లు బీజేపీ కి అంత అనుకూల వాతావరణం లేదు అని..వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది అని చెపుతున్నారు. మరి ఎవరి మాటలు నిజం అవుతాయో తేలాలంటే జూన్ నాలుగు వరకు ఆగాల్సిందే. దేశంలో పార్టీ లు అన్ని ప్రచారం పనిలో మునిగి ఉన్న వేళ అమెరికా కు చెందిన దిగ్గజ సంస్థ మైక్రో సాఫ్ట్ సంచలన విషయాన్ని వెల్లడించింది.

అదేంటి అంటే చైనా భారత్ లో ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయతిస్తోంది అని. అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి వీడియో కంటెంట్ ను తయారు చేసి సోషల్ మీడియా లో విస్తృతంగా ప్రచారం చేయటం ద్వారా ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది అని మైక్రో సాఫ్ట్ వెల్లడించింది. ఈ ఆరోపణలు ఏదో రాజకీయ పార్టీ చేస్తే పెద్దగా నమ్మాల్సిన అవసరం ఉండేది కాదు కానీ..మైక్రో సాఫ్ట్ ఈ విషయాన్ని వెల్లడించటంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే ఈ కంటెంట్ ఎన్నికలపై చూపించే ప్రభావం చాలా చాలా పరిమితంగానే ఉంటుంది అని మైక్రో సాఫ్ట్ నివేదిక వెల్లడించింది. ఒక్క భారత్ లోనే కాకుండా మరో వైపు అమెరికా, దక్షిణ కొరియా ఎన్నికల విషయంలో కూడా చైనా ఇలాగే చేయబోతున్నట్లు మైక్రో సాఫ్ట్ నివేదిక వెల్లడించింది. తైవాన్ ఎన్నికల్లో ఇప్పటికే చైనా ఇప్పటికే ఇలాంటి ప్రయోగం చేసింది అని తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే రాజకీయ పార్టీ లు అన్ని ఫేక్ కంటెంట్ తో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్న వేళ ఇప్పుడు చైనా ఏఐ టెక్నాలజీ తో రంగంలోకి దిగితే అది ఇంకెంత దారుణంగా మారుతుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it