Telugu Gateway
Top Stories

మార్కెట్ బూమ్ పై సిజెఐ కీలక వ్యాఖ్యలు

మార్కెట్ బూమ్ పై సిజెఐ కీలక వ్యాఖ్యలు
X

దేశీయ స్టాక్ మార్కెట్ లకు సంబంధించి గురువారం నాడు కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ మార్కెట్ల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సెన్సెక్స్, నిఫ్టీ లు కొత్త కొత్త జీవిత కాల గరిష్ట స్థాయిలకు చేరినందున నియంత్రణ సంస్థలు అయిన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), సెక్యూరిటీస్ అప్పీలేట్ ట్రిబ్యునల్స్ (శాట్)లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒక వైపు పెరుగుదలను సెలబ్రేట్ చేసుకుంటూనే...వెన్నెముక శక్తివంతంగా ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉంది అని వ్యాఖ్యానించారు. బిఎస్ఈ సెన్సెక్స్ తొలిసారి బుధవారం 80 వేల పాయింట్స్ కు చేరిన విషయం తెలిసిందే. గురువారం నాడు కూడా మరో కొత్త రికార్డు స్థాయికి చేరుకొని తొలిసారి సెన్సెక్స్ 80 వేల పాయింట్స్ పైన ముగిసింది. ఈ తరుణంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి మార్కెట్లపై హెచ్చరిక జారీచేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. శుక్రవారం నాటి మార్కెట్ పై ఇది ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉందా అన్న చర్చ కూడా ఇప్పుడు సాగుతోంది. ముంబైలో కొత్త శాట్ ఆఫీస్ ప్రారంభించిన సమయంలో చంద్రచూడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మార్కెట్ లో కరెక్షన్స్ ఎప్పటి నుంచో డ్యూ ఉంది అని...లోక్ సభ ఫలితాలు వెల్లడి తర్వాత ఇది ఉంటుంది అని ఎక్కువ మంది భావించారు.

బీజేపీ కి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాకపోయినా మర్కెట్స్ వరసగా దూసుకెళుతుండంపై మార్కెట్ వర్గాల్లో కూడా ఒకింత ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది అనే చెప్పాలి. అయితే కరెక్షన్ అంటూ మొదలు అయిన తర్వాత అది భారీ స్థాయిలో ఉంటుంది అని ఎక్కువ మంది అంచనా వేస్తున్నారు. అయితే అది కూడా ఎక్కువ దూరంలో లేదు అని...బడ్జెట్ కు ముందు కరెక్షన్ ఉంటుందా..లేక బడ్జెట్ తర్వాత అన్నది మాత్రం తేలాల్సి ఉంది. అయితే వరసగా పెరుగుతున్న మార్కెట్స్ ను చూసి ఇప్పుడు కొత్తగా ఇన్వెస్టర్స్ ఎంట్రీ ఇవ్వటం మాత్రం సరికాదు అని చెపుతున్నారు. ఏదైనా ఒక భారీ కరెక్షన్ తర్వాత ఇన్వెస్టర్స్ మార్కెట్ లో కొనుగోళ్లు చేయటం ఉత్తమం అని నిపుణులు చెపుతున్న మాట. ఇది ఇలా ఉంటే సెన్సెక్స్ అత్యంత వేగంగా పదివేల పాయింట్స్ పెరగటంలో కేవలం ఐదు అంటే ఐదు షేర్లు 50 శాతం మేర భాగస్వాములు అయ్యాయి. అందులో రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతి ఎయిర్ టెల్ , ఎస్ బిఐ , మహీంద్రా అండ్ మహీంద్రా, ఐసిఐసిఐ బ్యాంకు ఉన్నాయి. కేంద్రంలో మూడవ సారి భాగస్వాములతో కలిసి బీజేపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంతో మార్కెట్ లు బ్రేకులు లేని వాహనంలాగా దూసుకెళుతూనే ఉన్నాయి.

Next Story
Share it