Telugu Gateway
Top Stories

జులైలో 12 కోట్ల వ్యాక్సిన్ డోసులు

జులైలో 12 కోట్ల వ్యాక్సిన్ డోసులు
X

దేశంలో పెద్ద ఎత్తున వ్యాక్సిన్ల‌ను అందుబాటులోకి తెస్తున్నా కొంత మంది నేత‌లు విమ‌ర్శ‌లు చేయ‌టాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ త‌ప్పుప‌ట్టారు. విమ‌ర్శ‌లు మాని వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ సాఫీగా సాగేందుకు ప‌ని చేయాల‌ని సూచించారు. జులై నెల‌లో ఏకంగా 12 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి రానున్నాయ‌ని తెలిపారు. ప్రైవేట్ ఆస్ప‌త్రుల్లో అందుబాటులోఉండే వాటికి ఇవి అద‌నం అని పేర్కొన్నారు. కేంద్రం కొనుగోలు చేసి రాష్ట్రాల‌కు స‌ర‌ఫ‌రా చేసే వ్యాక్సిన్లే 12 కోట్లు అన్నారు. జూన్ నెల‌లో కూడా 11.5 కోట్ల డోసుల‌ను దేశ‌మంత‌టికీ స‌ర‌ఫరా చేశామ‌ని హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ వెల్ల‌డించారు.

ఇంత భారీ ఎత్తున వ్యాక్సిన్లు స‌ర‌ఫ‌రా చేస్తున్నా ఇంకా కొర‌త ఉంద‌ని విమ‌ర్శ‌లు చేయ‌టం స‌రికాద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. కేంద్రం తాజాగా అమెరికాకు చెందిన మోడెర్నా వ్యాక్సిన్ కు అనుమ‌తి మంజూరు చేసింది. గురువారం నాడే జైడ‌స్ క్యాడిలా కూడా త‌మ వ్యాక్సిన్ అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తి ఇవ్వాల‌ని కేంద్రానికి ద‌ర‌ఖాస్తు చేసుకున్న విష‌యం తెలిసిందే. కేంద్రం వెల్ల‌డించిన లెక్క‌ల ప్ర‌కారం దేశ వ్యాప్తంగా 33.57 కోట్ల మందికి వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ పూర్త‌యింది. ఇందులో 27.60 కోట్ల మందికి తొలి డోసు పూర్తి కాగా, 5.96 కోట్ల మందికి రెండు డోసుల వ్యాక్సినేష‌న్ పూర్తి అయింది.

Next Story
Share it