Telugu Gateway
Top Stories

కేంద్రం కొనుగోలు చేసే రూ 150 వ్యాక్సిన్..రాష్ట్రాలకు ఉచితమే

కేంద్రం కొనుగోలు చేసే రూ 150 వ్యాక్సిన్..రాష్ట్రాలకు ఉచితమే
X

కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి ధరల అంశంపై రాజకీయ దుమారం రేగిన విషయం తెలిసిందే. కేంద్రానికి 150 రూపాయలకు వ్యాక్సిన్ సరఫరా చేస్తున్న సీరమ్ సంస్థ రాష్ట్రాలకు మాత్రం 400 రూపాయలు, ప్రైవేట్ సంస్థలకు మాత్రం 600 రూపాయలకు విక్రయిస్తామని పేర్కొంది. అప్పటి నుంచి దుమారం రేగింది. ఒకే దేశం..ఒకే వ్యాక్సిన్ ధర ఉండదా అంటూ పలు పార్టీలు..రాష్ట్రాలు కేంద్రం తీరును తప్పుపట్టాయి. ఈ తరుణంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. కేంద్రం తయారీ సంస్థల నుంచి 150 రూపాయలతో కొనుగోలు చేసే వ్యాక్సిన్ ను రాష్ట్రాలకు ఉచితంగానే అందిస్తామని ప్రకటించింది.

దేశంలోని వ్యాక్సిన్ తయారీ సంస్థలు 50 శాతం కోటాను విధిగా కేంద్రానికే సరఫరా చేయాలని తాజాగా ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మిగిలిన 50 శాతాన్ని రాష్ట్రాలకు, ప్రైవేట్ సంస్థలకు నేరుగా విక్రయించుకునే వెసులుబాటు కల్పించారు. 150 రూపాయలకు కొనుగోలు చేసే వ్యాక్సిన్లను ఏ రాష్ట్రానికి ఎంత మేర పంపాలనేది ఇక కేంద్రం చేతుల్లో ఉండనుంది. ఇప్పటికే కేంద్రం తమ తమ రాష్ట్రాలపై వివక్ష చూపిస్తుందని పలు రాష్ట్రాలు విమర్శలు చేస్తున్నాయి. మరి కేంద్రం తాను సేకరించే 50 శాతం వ్యాక్సిన్ ను ఏ నిష్పత్తిలో ఆయా రాష్ట్రాలకు సరఫరా చేస్తుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it