'ప్రైవేట్ కు ' బూస్టర్ డోసు బాధ్యతలు
ప్రజలు చేతి చమురు వదిలించుకోవాల్సిందే
ఏప్రిల్ 10 నుంచి అందుబాటులోకి..కేంద్ర నిర్ణయం
కోవిడ్ వ్యాక్సినేషన్ బాధ్యత నుంచి కేంద్రం తప్పుకుంది. సుప్రీంకోర్టు పుణ్యమా అని రెండు డోసులు సర్కారీ ఖర్చుతో వేసిన వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయినట్లే. ఇప్పుడు కొత్తగా 18 సంవత్సరాలు పైబడిన వారంతా ప్రికాషన్ (బూస్టర్ డోసులు) తీసుకోవచ్చని తెలిపింది. అయితే ఇవి పూర్తిగా ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లోనే అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. అంటే బూస్టర్ డోసు తీసుకునే వారు ఆ మేరకు చేతి చమురు వదిలించుకోవాల్సిందే. వ్యాక్సిన్ కంపెనీలు ఇప్పుడు ఇది ఓ పెద్ద వ్యాపారంగా మారనుంది. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ దాదాపు తుది దశకు చేరి..వ్యాక్సిన్లకు డిమాండ్ తగ్గిన సమయంలో భారత్ వంటి దేశంలో అందరికీ అంటే 18 సంవత్సరాలు పైడిన వారికి వ్యాక్సినేషన్ అనుమతించటం అంటే కంపెనీలకు ఇది పండగే.
ప్రికాషన్ డోసు తీసుకునే వారు రెండవ డోసు తీసుకుని తొమ్మిది నెలలు అయి ఉండాలని పేర్కొన్నారు. వారే దీనికి అర్హులు. హెల్త్ కేర్ వర్కర్లు, అరవై సంవత్సరాల పైబడిన వారికి మాత్రం ప్రభుత్వ కేంద్రాల్లోనే ప్రికాషన్ డోసు ఇస్తారని తెలిపారు. దేశంలో ఎప్పటి నుంచో బూస్టర్ డోసు పై చర్చ సాగుతోంది. కేంద్రం ఇప్పుడు దీనిపై నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో అక్కడక్కడ కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న తరుణంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవటంతో చాలా మంది బూస్టర్ డోసు లు తీసుకునే ఛాన్స్ ఉంది.