Telugu Gateway
Top Stories

పీఎఫ్ఐపై ఐదేళ్ల నిషేధం

పీఎఫ్ఐపై ఐదేళ్ల నిషేధం
X

పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్ ఐ)పై కేంద్రం కొర‌డా ఝ‌ళిపించింది. ఐదేళ్ల పాటు ఈ సంస్థ‌కు చెందిన కార్య‌క‌లాపాల‌పై నిషేధం విధిస్తూ కేంద్ర హోం శాఖ బుధ‌వారం నాడు ఆదేశాలు జారీ చేసింది. గ‌త కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పీఎఫ్ఐ కార్య‌క‌లాపాల‌పై దాడులు నిర్వ‌హించిన ఎన్ ఐఏ నివేదిక ఆధారంగా కేంద్రం ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఎంపిక చేసిన యువ‌త‌ను ఉగ్ర‌వాదం వైపు మ‌ళ్లేలా చేయ‌టంతోపాటు..దేశంలో మ‌త విద్వేషాలు రెచ్చ‌గొట్ట‌డం..దాడుల‌కు తెగ‌బ‌డేందుకు పీఎఫ్ ఐ స‌న్నాహాలు చేస్తోంద‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. ఈ నిషేధం స‌త్వ‌ర‌మే అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది. చ‌ట్ట‌వ్య‌తిరేక కార్య‌క‌లాపాల నిరోధ‌క చ‌ట్టం (యూఏపీఏ) కింద కేంద్రం పీఎఫ్ఐపై నిషేధం విధించింది. ఉగ్ర‌వాద కార్యక‌లాపాల‌కు ఈ సంస్థ ఆర్ధిక సాయం అందిస్తుంద‌ని..ప‌లు విదేశీ సంస్థ‌ల నుంచి దీనికి నిధులు అందుతున్నాయ‌ని దాడుల్లో గుర్తించారు. ఇటీవ‌ల ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీపై హ‌త్య‌కు పీఎఫ్ఐ ప్ర‌య‌త్నం చేసింద‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా ఈ సంస్థల కార్య‌క‌లాపాల‌పై పెద్ద ఎత్తున దాడులు జ‌రిగాయి. ఎన్‌ఐఏ, ఇతర దర్యాప్తు సంస్థలు కలిసి ఆపరేషన్‌ ఆక్టోపస్‌ కింద మంగళవారం పీఎఫ్ఐ సభ్యుల ఇళ్లలో సోదాలు నిర్వహించాయి.

ఏడు రాష్ట్రాల్లో 170 మందికి పైగా పీఎ్‌ఫఐ కార్యకర్తలు, సభ్యులను అరెస్టు చేశాయి. ఇస్లామిక్‌ తీవ్రవాద సంస్థ పీఎఫ్‌ ఐ కార్యాలయాలపై ఈ నెల 22న దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో దాడులు నిర్వహించి 106 మందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఐదు రోజుల తర్వాత మంగళవారం ఢిల్లీ, అసోం, కర్ణాటక, మహారాష్ట్ర, యూపీ, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌, నిజాముద్దీన్‌, జామియానగర్‌ ప్రాంతాల్లో దాడులు చేసి 30 మందికిపైగా పీఎ్‌ఫఐ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ముందుజాగ్రత్త చర్యగా జామియానగర్‌ ప్రాంతంలో నవంబరు 17 వరకు 144 సెక్షన్‌ విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల నిషేధాజ్ఞల నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎవరూ గుమిగూడవద్దని జామియా మిల్లియా వర్సిటీ కోరింది. కర్ణాటకలోని బీదర్‌, మంగళూరు, కోలార్‌, విజయ్‌పుర, బాగల్‌కోట్‌, చిత్రదుర్గ, బళ్లారి, చామరాజనగర్‌ సహా 13 జిల్లాల్లో పోలీసులు దాడులు నిర్వహించి 75 మందిని అదుపులోకి తీసుకున్నారు. అసోంలో గోల్‌పరా, కామరూప్‌, బర్పెట, ధుబ్రి, బగ్సా, దర్రాంగ్‌, ఉదల్‌గురి, కరీంగంజ్‌ జిల్లాల్లో సోదాలు చేసి, 25 మంది పీఎ్‌ఫఐ సభ్యులను అరెస్టు చేశారు. మహారాష్ట్ర పోలీసులు పుణెలో ఆరుగురు పీఎ్‌ఫఐ సభ్యులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ముంబ్రాలో మరో ఇద్దరిని అరెస్టు చేశారు.

గుజరాత్‌లో 10 మందిని, మధ్యప్రదేశ్‌లో 21 మందిని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలో జూలైలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం, విజయ సంకల్ప సభను టార్గెట్‌గా చేసుకుని రెక్కీ నిర్వహించారా అనే కోణంలో ఎన్‌ఐఏ ఆరా తీస్తోంది. రాష్ట్రంలో జూలై 4న నిజామాబాద్‌లో పీఎ్‌ఫఐ కార్యకలాపాలు తొలిసారిగా వెలుగులోకి వచ్చాయి. ఎన్‌ఐఏ ఆగస్టు 26న కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. పీఎఫ్‌ఐ నాయకులు, కార్యకర్తల్ని అరెస్ట్‌ చేయడానికి ముందే జరిగిన బీజేపీ సమావేశం, సభకు సంబంధించి ఇక్కడ ఏదైనా ప్లాన్‌ అమలు చేసే కుట్ర జరిగిందా అనే కోణంలో ఎన్‌ఐఏ ప్రత్యేక బృందాలు విచారణ జరుపుతున్నాయి. ఇప్పటికే అరెస్టయి జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న వారిని కస్టడీకి అప్పగించాలంటూ ఎన్‌ఐఏ అధికారులు కోర్టును ఆశ్రయించారు. తెలంగాణలో ఇప్పటి వరకు ఎవర్ని టార్గెట్‌ చేశారు? ఎక్కడెక్కడ రెక్కీలు నిర్వహించారు? తదితర అంశాలపై వివరాలు రాబట్టేందుకు ప్రత్యేక బృందాలు సిద్ధమవుతున్నాయి.

Next Story
Share it