Telugu Gateway
Top Stories

ఇది ఎలా సమర్థనీయం అన్న కుమార స్వామి

ఇది ఎలా సమర్థనీయం అన్న కుమార స్వామి
X

పరిశ్రమలకు రాయితీలు..సబ్సిడీలు ఇవ్వటం సహజమే. అటు కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలు కూడా ఇదే పని చేస్తాయి. ప్రతి రాష్ట్రం తమ పారిశ్రామిక విధానం ప్రకారం ఇవి ఇస్తాయి. భారీ కంపెనీలు..ప్రతిష్టాత్మక సంస్థలు వచ్చినప్పుడు అమలులో ఉన్న విధానాలను పక్కన పెట్టి కూడా ప్రత్యేక రాయితీలు, ప్రోత్సహకాలు ఇచ్చిన సందర్భాలు ఉంటాయి. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం అయిన గుజరాత్ లో అమెరికాకు చెందిన ప్రముఖ సెమీకండక్టర్ తయారీ సంస్థ మైక్రాన్ 2 .5 బిలియన్ డాలర్స్ తో అంటే మన భారతీయ కరెన్సీలో దగ్గర దగ్గర 20750 కోట్ల రూపాయలతో యూనిట్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఐదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఈ యూనిట్ కు కేంద్రం రెండు బిలియన్ డాలర్స్ అంటే మన కరెన్సీలో 16600 కోట్ల రూపాయల సబ్సిడీలూ ఇస్తోంది అని కేంద్రంలో కొత్తగా ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి బాధ్యతలు చేపట్టిన హెచ్ డి కుమార స్వామి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఈ లెక్కన కంపెనీ కల్పించే ఒక్కో ఉద్యోగంపై 3 . 2 కోట్ల రూపాయల సబ్సిడీ ఇస్తున్నట్లు అవుతుంది అని...ప్రజల డబ్బును ఇలా ఇంత భారీ మొత్తంలో ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని అధికారులను అడిగినట్లు కుమార స్వామి తెలిపారు. ఆయన కర్ణాటకలో ఉన్న పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించినట్లు ప్రముఖ ఆంగ్ల పత్రిక టైమ్స్ అఫ్ ఇండియా ఒక స్టోరీ ప్రచురించింది. కంపెనీ పెట్టే పెట్టుబడిలో ఏకంగా డెబ్భై శాతం రాయితీ ఇచ్చి దాన్ని ఎలా సమర్ధించుకుంటామని ఆయన అధికారులను ప్రశించారు. బెంగళూరు లో ఉన్న పీన్య అనే పారిశ్రామిక వాడ లో ఉన్న చిన్న పరిశ్రమలు ఎన్ని లక్షల మందికి ఉపాధి కల్పించాయి...వాళ్లకు మనం కల్పించిన ప్రయోజనాలు ఏంటి అని ప్రశ్నించారు. దేశ సంపదను కాపాడేందుకు తాను ఇలాంటి వాటిపై దృష్టి పెడుతున్నట్లు కుమార స్వామి తెలిపారు.

తనకు ప్రధాని మోడీ అత్యంత కీలకమైన శాఖ ఇచ్చారు అని..దీని ద్వారా దేశంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై దృష్టి సారిస్తాను అని తెలిపారు. మైక్రాన్ విషయంలో కేంద్రంలోని మోడీ సర్కారు కల్పించిన రాయితీ విషయాలను బహిర్గతం చేయటం ఖచ్చితంగా దుమారం రేపటం ఖాయంగా కనిపిస్తోంది. దేశంలో యూనిట్ ఏర్పాటు కోసం ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా ప్రత్యేక రాయితీలు కోరుతుంటే...ఎవరికైనా ఒక విధానం..కంపెనీల కోసం ప్రత్యేక పాలసీ ఉండదు అని కేంద్రం చెపుతూ వస్తోంది. మరి మైక్రాన్ విషయంలో ఏకంగా కేంద్రం ఇంత భారీ మొత్తంలో సబ్సిడీలు పాలసీ ప్రకారమే ఇచ్చిందా..లేక యూనిట్ గుజరాత్ లో కాబట్టి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారా అన్నది కుమార స్వామే చెప్పాలి.

Next Story
Share it