Telugu Gateway
Top Stories

కేంద్ర మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ముహుర్తం ఫిక్స్

కేంద్ర మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ముహుర్తం ఫిక్స్
X

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ బుధ‌వారం సాయంత్రం కేంద్ర మంత్రివ‌ర్గాన్ని విస్త‌రించ‌నున్నారు. ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు. తొలుత జూన్ 8న మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఉండొచ్చ‌ని ఊహ‌గానాలు వ‌చ్చినా ..అది రేపే అని తేలిపోయింది. అయితే ఈ విస్త‌ర‌ణ‌లో తెలుగు రాష్ట్రాల‌కు ఏమైనా ఛాన్స్ ఉంటుందా..లేదా అన్న అంశంపై ఇప్ప‌టి వర‌కూ స్ప‌ష్ట‌త లేదు. తెలంగాణ నుంచి ప్ర‌స్తుతం కిష‌న్ రెడ్డి ఒక్క‌రే మంత్రివ‌ర్గంలో ఉన్నారు. ఏపీ నుంచి అస‌లు ప్రాతినిధ్య‌మే లేదు. అయితే మంగ‌ళ‌వారం నాడు మాజీ ఎంపీ కంభంపాటి హ‌రిబాబుకు మిజోరం గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి ద‌క్క‌టంతో ఇక ఏపీకి ఛాన్స్ ఉండ‌ద‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. ఇదిలా ఉంటే మోడీ త‌న విస్త‌ర‌ణ‌లో ముఖ్యంగా ఎన్నిక‌లు జ‌రిగే ఉత్త‌ర‌ప్రదేశ్, ఉత్త‌రాఖండ్ త‌దిత‌ర రాష్ట్రాల‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌బోతున్నారు. అదే స‌మ‌యంలో సారి ఎన్డీయేలోని భాగ‌స్వాముల‌కు కూడా చోటు ద‌క్కే అవ‌కాశం ఉంది.

ఈ కేబినెట్‌లో 20 మందికి పైగా కొత్తవారికి అవకాశం దక్కనున్న‌ట్లు స‌మాచారం. కేంద్ర కేబినెట్‌లో మొత్తం 81 మంది మంత్రులకు అవకాశం ఉండగా.. ప్రస్తుతం 53 మందితోనే మంత్రివర్గం కార్యకలాపాలు కొనసాగిస్తుంది. మిగిలిన 28 స్థానాలను భ‌ర్తీ చేస్తారా..లేక కొన్ని ఖాళీల‌ను అలా ఉంచుతారా అన్న‌ది వేచిచూడాల్సిందే. విస్త‌ర‌ణ జాబితాలో ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న సీనియర్‌ నాయకుడు జ్యోతిరాధిత్య సింధియా, అసోం మాజీ సీఎం శర్వానంద్ సోనోవాల్, జేడీయూ నాయకులు ఆర్‌సీపీ సింగ్‌, లల్లన్‌ సింగ్‌ (బిహార్‌), అప్నా దళ్‌ నేత అనుప్రియ పాటిల్‌, పంకజ్‌ చౌదరి(యూపీ), కైలశ్‌ విజయవర్గీయ (మధ్యప్రదేశ్‌), నారాయణ రాణే (మహారాష్ట్ర), రీటా బహుగుణ జోషి, రామశంకర్‌ కథేరియా (యూపీ), పశుపతి పారస్‌, రాహుల్‌ కశ్వన్‌, చంద్రప్రకాశ్‌ జోషి (రాజస్థాన్‌) పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో చాలా మంది ఇప్పటికే హస్తినకు చేరుకున్నారు.

Next Story
Share it