Telugu Gateway

బాబోయ్..మీడియా..భ‌య‌ప‌డుతున్న జ‌నం

బాబోయ్..మీడియా..భ‌య‌ప‌డుతున్న జ‌నం
X

సెల‌బ్రిటీల ప్ర‌మాదం అంత సేల‌బుల్ స‌బ్జెక్టా?

సాయి ధ‌ర‌మ్ తేజ్ బైకు టైర్లు ఎక్క‌డ త‌యారు చేశారు?

ఆ బైక్ కు ఉన్న గేర్లు ఎన్ని...రోజంతా ఇదే గోల‌

దుమ్మెత్తిపోస్తున్న నెటిజ‌న్లు

రెండు సంఘ‌ట‌న‌లు. జ‌రిగింది హైద‌రాబాద్ లోనే. కానీ మీడియాలో చూసే కోణంలో ఎంత తేడా?. ఎంత వివ‌క్ష‌. ఆరేళ్ల అమ్మాయిని అత్యంత దారుణంగా రేప్ చేసి..హ‌త్య చేశాడు ఓ దుర్మార్గుడు. దీనిపై బాధిత కుటుంబాలు రోడ్డెక్కి ధ‌ర్నాకు దిగితే ఆ సంఘ‌ట‌న‌కు కొంత సేపు అంటే నిమిషాల పాటు చూపించి వ‌దిలేశారు. పోలీసులు అయితే నిందితుడిని ప‌ట్టుకున్నారు. ఆ త‌ర్వాత ఏమి జ‌రుగుతుంది అనేది వేరే విష‌యం. కానీ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ బైక్ ప్ర‌మాదానికి గురైంది. ల‌క్కీగా అత‌ను చిన్న గాయాల‌తోనే బ‌య‌ట‌ప‌డ్డాడు. కానీ శుక్ర‌వారం రాత్రి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ ఏ మాత్రం గ్యాప్ లేకుండా మీడియా అదే అంశంపై విప‌రీత‌మైన క‌వ‌రేజ్ ఇవ్వ‌ట‌మే కాదు...ఆ బైక్ ధ‌ర ఎంత‌?. దానికి ఎన్ని గేర్లు ఉంటాయి. అందులో ఏ పెట్రోల్ వాడ‌తారు..అది ఎక్క‌డ త‌యారు చేస్తారు వంటి అంశాల‌పై చ‌ర్చ‌లు పెట్టి మ‌రీ ప్ర‌త్యేక క‌వ‌రేజ్ ఇస్తున్నారు. మీడియాలో సున్నిత‌త్వం అనేది ఎప్పుడో పోయింది. అది రాను రాను మ‌రింత ప్ర‌మాద‌క‌రంగా మారుతోంది. మీడియాకు ఎంత సేపూ సేల‌బుల్ స‌బ్జెక్ట్ కావాలి. అది సెల‌బ్రిటీల‌ది అయితే ఇంకా మంచిది.

సాయి ధ‌ర‌మ్ తేజ్ . మెగా ఫ్యామిలీ స‌భ్యుడు. అందునా చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ వీరంతా ఆస్ప‌త్రికి సంద‌ర్శించే స‌న్నివేశాలు..చేసే ట్వీట్లూ. ఒక బైక్ యాక్స్ డెంట్ కు మీడియా ఇచ్చిన ప్రాదాన్య‌త చూసి నెటిజ‌న్లు ఛాన‌ళ్ళ‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఆ బైక్ ప్ర‌మాదానికి కూడా రేసింగ్ అనే అనుమానాలు ఉన్నాయి. అయితే ఇంకా నిర్ధార‌ణ కావాల్సి ఉంది పోలీసు విచార‌ణ‌లో. తెలంగాణ‌తోపాటు ఏపీలోనూ చాలా చోట్ల ర‌హ‌దారులు అత్యంత దారుణంగా ఉన్నాయి. నిత్యం ప‌దుల సంఖ్య‌లో ప్ర‌జ‌లు తీవ్ర ప్ర‌మాదాల బారిన ప‌డుతున్నారు. అలాంటివి మీడియాకు నిమిషాల వార్త‌లు కూడా కావు. కానీ ఓ హీరో ఖ‌రీదైన బైక్ తో ప్ర‌మాదం బారిన ప‌డితే ఆ రోడ్డుపై ఉన్న కొద్దిపాటి ఇసుక‌తోపాటు...అన్నీ స‌మ‌స్య‌లే. అవే సామాన్యుల ప్రాణాలు అయితే ప్ర‌భుత్వాల త‌ప్పు ఉన్నా..అదికారుల త‌ప్పు ఉన్నా ఏమీ కాదు. మీడియా స‌హా ఎవ‌రూ ప‌ట్టించుకోరు. ఎక్కువ ప‌ట్టించుకుంటే వాళ్ళ‌కు ప్ర‌మాదం కాబ‌ట్టి.

Next Story
Share it