సీరమ్...భారత్ బయోటెక్ వ్యాక్సిన్ల పై మరింత సమాచారం కోరిన కేంద్రం
కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి బుధవారం నాడు కీలక పరిణామం చోటుచేసుకుంది. అత్యవసర వినియోగానికి అనుమతించాల్సిందిగా ఇప్పటికే ఫైజర్ తోపాటు సీరమ్ ఇన్ స్టిట్యూట్, భారత్ బయోటెక్ లు కేంద్ర నియంత్రణా సంస్థలకు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై బుధవారం నాడు సమావేశం అయిన కేంద్ర ఔషధ ప్రామాణిక నియంత్రణా సంస్థ (సీడీఎస్ సీవో) కి చెందిన నిపుణుల కమిటీ ఈ ప్రతిపాదనలను పరిశీలించింది.
ఆయా వ్యాక్సిన్ల సమర్ధతకు సంబంధించి సరైన సమాచారం లేకపోవటం, భద్రతకు సంబంధించిన అంశంపై స్పష్టత లేకపోవటంతో మరింత సమాచారం అందజేయాల్సిందిగా ఆయా సంస్థలను కోరారు. ఈ పరిణామాలను గమనిస్తే దేశంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావటానికి మరింత సమయం పట్టే సూచనలు కన్పిస్తున్నాయి. నియంత్రణా సంస్థలు సంతృప్తి చెందేలా ఔషధ కంపెనీలు ఆయా వ్యాక్సిన్ల సమర్ధత, భద్రతకు సంబంధించిన సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.