Telugu Gateway
Top Stories

చిత్రా రామ‌కృష్ణ అరెస్ట్

చిత్రా రామ‌కృష్ణ అరెస్ట్
X

చిత్రా రామ‌కృష్ణ. ఈ పేరు గ‌త కొన్ని రోజులుగా దేశంలో పెద్ద సంచ‌ల‌నం రేపింది. అస‌లు కేసు న‌మోదు అయిన‌ప్ప‌టి సంగ‌తి ఏమో కానీ..ఆమె చెప్పిన విష‌యాలు విన్న‌ప్పుడు మాత్రం అంద‌రూ షాక్ కు గుర‌య్యారు. వాటినే సెబీ త‌న సుదీర్ఘ నివేదిక‌లో ప్ర‌స్తావించ‌టం క‌ల‌క‌లం రేపింది. ప‌లు అంశాల్లో త‌న‌కు హిమాల‌యాల్లో ఉండే ఓ నిరాకార వ్య‌క్తి స‌హ‌కారం అందించార‌ని..ఆయ‌న త‌న‌కు ప‌లు స‌లహాలు, సూచ‌న‌లు ఇచ్చిన‌ట్లు కూడా చిత్రా రామ‌కృష్ణ వెల్ల‌డించింది. అస‌లు నిరాకార వ్య‌క్తి స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వ‌టం సాధ్యం అవుతుందా?. అలాంటి వ్య‌క్తి నిజంగానే ఉంటే షీషెల్స్ లో చిల్ అవుదాం అని ఎలా ఈ మెయిల్స్ చేస్తారు?.. అంతే కాక ఆమె హెయిర్ స్టైల్, డ్ర‌స్ ల గురించి నిరాకార వ్య‌క్తి మెయిల్స్ చేయ‌టం జ‌రిగే పనేనా అన్న చ‌ర్చ దేశ వ్యాప్తంగా సాగింది. సెబీ నివేదిక‌లోని అంశాలు పెద్ద కామెడీగా మారిపోయాయి. అయితే ఆ త‌ర్వాత జ‌రిగిన విచార‌ణ‌లో ఒక్కొక్క‌టీగా అస‌లు విష‌యాలు వెలుగు చూస్తున్నాయి. చిత్రా రామ‌కృష్ణ చెప్పిన నిరాకార వ్య‌క్తి ఆనంద్ సుబ్ర‌మ‌ణియ‌న్ అని విచార‌ణ సంస్థ‌లు దాదాపు ఓ నిర్ధార‌ణ‌కు వ‌చ్చాయి.

ఈ కొ లొకేష‌న్ కేసులో ఎన్‌ఎస్‌ఈ గ్రూపు మాజీ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ఆనంద్‌ సుబ్రమణియన్‌ను ఫిబ్రవరి 25న సీబీఐ అరెస్ట్‌ చేసింది. ఇప్పుడు చిత్రా వంతు వ‌చ్చింది. ఆమెను ఆదివారం నాడు సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో ఆమెను అరెస్ట్‌ చేసిన అధికారులు అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి, సీబీఐ ప్రధాన కార్యాలయం లాకప్‌లో ఉంచారు. సోమవారం సీబీఐ కోర్టులో హాజరుపరచనున్నారు. సీబీఐ ప్రత్యేక కోర్టు శనివారం చిత్రా పెట్టుకున్న యాంటిసిపేటరీ బెయిల్‌ను తిరస్కరించిన మర్నాడే అధికారులు అరెస్ట్‌ చేయడం గమనార్హం. గత మూడు రోజులుగా అధికారులు ఆమె నివాసాల్లో తనిఖీలు నిర్వహించారు.ఎన్ని ప్రశ్నలు వేసినా సరైన సమాధానం ఇవ్వలేదని తెలిసింది. ఎన్‌ఎస్‌ఈ కొలోకేషన్‌ కేసులో సీబీఐ 2018 నుంచి దర్యాప్తు చేస్తోంది. ఎన్‌ఎస్‌ఈ చీఫ్‌గా చిత్రా రామకృష్ణ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు సెబీ నివేదిక ఇటీవలే తేల్చడం ఈ కేసులో కీలక మలుపుగా నిలిచింది. ఒక అదృశ్య యోగితో ఆమె ఎన్‌ఎస్‌ఈకి సంబంధించి కీలక విధాన నిర్ణయాలను పంచుకోవడం, ఆమె నిర్ణయాల్లో యోగి పాత్ర ఉండడం బయటకొచ్చింది.

Next Story
Share it