నాలుగు వేల కార్లు కాలిపోయాయి
ఆ కార్లు జర్మనీ నుంచి అమెరికా వెళుతున్నాయి. సముద్ర మార్గం గుండా. కార్గో షిఫ్ లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంతో నాలుగు వేల కార్లు కాలిపోయాయిఒకటి కాదు..రెండు కాదు ఏకంగా నాలుగు వేల కార్లు కాలిపోయాయి. అందులో అత్యధిక శాతం కార్లు వోక్స్ వ్యాగన్ కు చెందినవే. ఇటీవల జరిగిన ఈ ప్రమాదం వివరాలు తాజాగా వెలుగుచూశాయి. అయితే ఈ కార్గో షిప్ లో ఉన్న 22 మంది సిబ్బంది మాత్రం పోర్చుగల్ సమీపంలో సేఫ్ గా బయటపడ్డారు. కానీ కాలిపోయిన కార్గో ఓడ మాత్రం అట్లాంటిక్ సముద్రంలో పూర్తిగా మునిగిపోయింది. ఇందులో వోక్స్ వ్యాగన్ గ్రూపు కార్లు.. ప్రీమియం బ్రాండ్లు అయిన 1100 పోర్షే, 189 బెంట్లీ కార్లు కూడా ఉన్నట్లు సమాచారం.
ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే పనిలో ఉన్నట్లు వోక్స్ వ్యాగన్ తెలిపింది. ఈ ప్రమాద వార్తను అసోసియేట్ ప్రెస్ వెల్లడించింది. షిప్పింగ్ కంపెనీతో కలసి విచారణ చేస్తున్నట్లు వోక్స్ వ్యాగన్ వెల్లడించింది. ఓ వైపు అసలే చిప్ ల కొరతతో కార్ల తయారీ దారుణంగా పడిపోయిన తరుణంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవటంతో అంతర్జాతీయ మార్కెట్లో కార్ల కొరత మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. డీలర్ల వద్ద కొత్త కార్లు పెద్దగా అందుబాటులో లేకపోవటంతో ఉన్న వాటి ధరలను పెంచటంతో పాటు వాడిన కార్లకు కూడా అదిరిపోయే రేట్లు చెబుతున్నారు.