భారత విమానాలను నో చెప్పిన కెనడా
భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. విద్యార్ధులు, పారిశ్రామికవేత్తలతోపాటు ఇతర అవసరాలు ఉన్న వారు పలు దేశాలకు వెళ్లే ఛాన్స్ లేకుండా పోతుంది. అక్కడ నుంచి ఇక్కడకు వచ్చే అవకాశం కూడా ఉండటం లేదు. దేశంలో అనూహ్యంగా పెరుగుతున్న కరోనా కేసులు దేశాల మధ్య ప్రయాణికుల సంబంధాలను కట్ చేస్తున్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్, బ్రిటన్ వంటి దేశాలు విమానాలకు నో చెబుతుంటే ఇప్పుడు కెనడా కూడా ఆ జాబితాలో చేరింది. యూఏఈ అయితే పది రోజుల పాటు విమాన సర్వీసులను తిప్పబోమని ప్రకటించింది. నెల రోజుల పాటు భారత్ నుంచి ప్రయాణికుల వాణిజ్య విమానాలతోపాటు ప్రైవేట్ విమానాలను కూడా అనుమతించబోమని కెనడా ప్రకటించింది. ఇప్పటికే పలు దేశాలు భారత్ పై ప్రయాణ ఆంక్షలు పెడుతున్నాయి. దేశంలో కరోనా కేసుల ఉదృతిని చూసిన తర్వాతే పలు దేశాలు వరస పెట్టి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. భారత్ తోపాటు పాకిస్థాన్ నుంచి వచ్చే విమానాలను కూడా నిషేధించారు. ఆయా దేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల ద్వారానే ఎక్కువ కేసులు నమోదు అవుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కెనడా రవాణా మంత్రి ఒమర్ అల్ గాబ్రా వెల్లడించారు.
తాత్కాలిక చర్యగానే ఈ నిర్ణయం తీసుకున్నామని ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షామని తెలిపారు. అయితే ఈ నిషేధం కార్గో విమానాలకు వర్తించదని తెలిపారు. నిరంతరాయంగా వ్యాక్సిన్, పీపీఈ కిట్ల సరఫరాకు ఎలాంటి అవాంతరాలు ఉండవన్నారు. భారత్ లో ప్రస్తుతం ఇఫ్పటివరకూ ప్రపంచంలో ఎక్కడా నమోదు కానీ తరహాలో అత్యధిక కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే. అందుకే తాజాగా దుబాయి-భారత్ మధ్య ఎమిరేట్స్ విమాన సర్వీసులను కూడా తాత్కాలికంగా రద్దు చేశారు. ఈ నెల 25 నుంచి 10 రోజులపాటు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఎమిరేట్స్ సంస్థ ప్రకటించింది.