Telugu Gateway
Top Stories

స్టార్టప్ ల పాపాలు..ఇన్వెస్టర్లకు శాపాలు

స్టార్టప్ ల పాపాలు..ఇన్వెస్టర్లకు శాపాలు
X

దేశంలో సంచలన స్టార్టప్ లు అంటే అందరికీ గుర్తు వచ్చే పేర్లలో పేటిఎం, బైజూస్ ఉంటాయి. ఆయా విభాగాల్లో ఈ రెండు సంస్థలు కొత్త కొత్త రికార్డు లు క్రియేట్ చేశాయని చెప్పాలి. దేశీయ విద్యారంగంలో ఎడ్యూటెక్ స్టార్టప్ బైజూస్ సాధించిన విజయాలు ఎన్నో. అయితే ఈ కంపెనీ ఎంత వేగంగా ఎదిగిందో...అంతే వేగంగా కూడా తన ప్రతిష్ట దిగజార్చుకుని వివాదాల్లో చిక్కుకోవటం ఇప్పుడు కలకలం రేపుతున్న అంశం. బైజూస్ ఏకంగా ఒక దశలో 22 బిలియన్ డాలర్స్ అంటే మన భారతీయ కరెన్సీ లో దగ్గర దగ్గర 1 .82 లక్షల కోట్ల రూపాయలకు చేరిన ఈ కంపెనీ విలువ..ఇప్పుడు ఏకంగా 1700 వందల కోట్ల రూపాయలకు పతనం అయింది. ఇది ఒక్కటే కాదు...బైజూస్ ను గత కొంత కాలంగా ఎన్నో వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇందులో పెట్టుబడి పెట్టిన విదేశీ సంస్థలు వాటిని రాబట్టుకునేందుకు కోర్టు లతో పాటు వివిధ మార్గాల్లో ఉన్న అన్ని ఆప్షన్స్ ను ఉపయోగించుకునే పనిలో పడ్డాయి. ఒక వైపు నిధుల సమస్యలు వెంటాడుతున్న సమయంలో తాజాగా ఈడీ బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్ పై లుక్ అవుట్ నోటీసు లు జారీ చేసింది. దీని ప్రకారం ఈడీ అనుమతి లేకుండా అయన దేశం విడిచి వెళ్ళటానికి లేదు. 9362 కోట్ల రూపాయలకు సంబంధించిన విషయంలో విదేశీ మారక నిర్వహణ చట్టం(ఫెమా) నిబంధనలు ఉల్లఘించారు అనే ఆరోపణలపై బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్ తో పాటు బైజూస్ మాతృ సంస్థ థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ కు గతంలో కూడా నోటీసు లు జారీ చేశారు. విదేశీ సంస్థల నుంచి పొందిన మొత్తాలను ఈ కంపెనీ పెద్ద ఎత్తున విదేశాల్లో కూడా పెట్టుబడిగా పెట్టినట్లు విచారణలో గుర్తించారు. ఇది ఫెమా నిబంధనల ఉల్లంఘన అని...దీని వల్ల కేంద్రానికి రావాల్సిన ఆదాయం కోల్పోయినట్లు తేల్చారు. బైజూస్ పతనానికి సంస్థ వ్యవస్థాపకుడు రవీంద్రన్ దూకుడు తో పాటు తప్పుడు నిర్ణయాలే కారణం అనే విమర్శలు ఉన్నాయి. క్రమక్రమంగా ఎదగటం కాకుండా...ఒకే సారి ఎక్కడికో వెళ్లిపోవాలని అత్యాశతో చేసిన పనులే ఈ స్థితికి కారణం అయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ఈ సమస్యలు అన్నిటి నుంచి బైజూస్ బయటపడుతుందా...తిరిగి పోయిన విలువను దక్కించుకుంటుందా అంటే అది అంత ఈజీ కాదు అనే మాటే ఎక్కువగా వినిపిస్తోంది.

బైజూస్ ఐపీఓ కు రాకపోయినా పెద్ద ఎత్తున విదేశీ సంస్థల నుంచి నిధులు సమీకరించింది. మరో ఫిన్ టెక్ కంపెనీ పేటిఎం కూడా ఇప్పుడు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటోంది. దీనికి కారణం ఆర్ బిఐ నిర్దేశించిన నియమ నిబంధనలను ఈ సంస్థ సరిగా పాటించక పోవటమే. ఈ కారణంగానే ఇటీవల ఆర్ బిఐ పేటి ఎం పే మెంట్స్ బ్యాంకు పై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన వెలువడినప్పటి నుంచి పేటి ఎం షేర్లు స్టాక్ మార్కెట్ లో కుప్ప కూలి ఇన్వెస్టర్లు వేల కోట్ల రూపాయల మేర నష్టపోయారు. పేటిఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ ఐపీఓ ద్వారా 18300 కోట్ల రూపాయలు సమీకరించింది. ఒక్కో షేర్ ను 2150 రూపాయలకు జారీ చేసింది. కానీ ఇప్పటి వరకు పేటిఎం షేర్లు ఆఫర్ ప్రైస్ ను దాట లేదు. తాజాగా ఆర్ బిఐ విధించిన ఆంక్షలతో ఈ షేర్ కొత్త కనిష్ట స్థాయి 369 రూపాయలకు చేరుకొని...ఇప్పుడిప్పుడే తిరిగి కోలుకొంటోంది. అయితే పేటిఎం ఈ సమస్యల నుంచి ఎప్పటికి బయటపడుతుంది అనే విషయంలో మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు. ఈ ఫిన్ టెక్ స్టార్టప్ కూడా యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఇప్పుడు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది అనే విమర్శలు ఉన్నాయి. దీంతో పాటు పేటిఎం లో చైనా పెట్టుబడులు ఉన్నాయనే విమర్శలు రాగా ..యాజమాన్యం దీన్ని ఖండిస్తూ వస్తోంది. ఈ సమస్యల నుంచి పేటిఎం బయటపడటం అంత ఈజీ గా జరుగుతుందా లేదా అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు. ఇప్పటికైతే ఆర్ బిఐ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం లేదు అనే సంకేతాలు పంపుతోంది. ఇలా దేశంలో సంచలన విజయాలు దక్కించుకున్న స్టార్టప్ లు బైజూస్, పేటి ఎంలు ఇప్పుడు సమస్యల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నాయి.వీటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అయినా మిగిలిన వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Next Story
Share it