Telugu Gateway
Top Stories

ఆల్ టైమ్ గ‌రిష్ట స్థాయికి సెన్సెక్స్

ఆల్ టైమ్ గ‌రిష్ట స్థాయికి సెన్సెక్స్
X

సెన్సెక్స్ మ‌రో కొత్త శిఖ‌రానికి చేరింది. దేశ చ‌రిత్ర‌లో మొద‌టిసారి బీఎస్ఈ సెన్సెక్స్ 60 వేల పాయింట్ల‌ను అధిగ‌మించింది. దీంతో మార్కెట్లో సంబ‌రాలు నెల‌కొన్నాయి. అంత‌ర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వ‌స్తుండ‌టంతో దేశీయ మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తున్నాయి. శుక్రవారం మార్కెట్ ప్రారంభ సమయంలో సెన్సెక్స్‌ 60,000 మార్క్‌ మైలురాయిని అధిగ‌మించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సెన్సెక్స్‌ 50వేల మార్క్‌ను క్రాస్‌ చేయగా కేవలం ఆరునెలల్లో మరో 10 వేల పాయింట్ల మేర లాభ‌ప‌డి సంచ‌ల‌నాలు న‌మోదు చేస్తున్నాయి.

క‌రోనా క‌ష్ట‌కాలంలోనూ స్టాక్ మార్కెట్లు దూకుడు ప్ర‌ద‌ర్శించ‌టం, ప‌లు షేర్లు భారీ లాభాలు చ‌విచూడ‌టం కూడా విశ్లేష‌కులు సైతం అంచ‌నాల‌కు చిక్క‌టం లేదు. కార‌ణాలు ఏమైనా మార్కెట్లోకి మాత్రం నిధులు భారీ ఎత్తున వ‌చ్చిప‌డుతున్నాయి. అదే స‌మ‌యంలో ఐపీవోలు సైతం ఎంట్రీ ఇస్తే చాలు ఊహించ‌నంత వేగంగా ఓవ‌ర్ స‌బ్ స్క్రైబ్ అవుతున్నాయి. శుక్ర‌వారం నాడు రిల‌య‌న్స్ తోపాటు ఇన్ఫోసిస్‌, ఏషియన్ పెయింట్స్‌,ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌,ఐసీఐసీఐ బ్యాంక్‌,హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌,హెచ్‌సీఎల్‌ టెక్‌,టీసీఎస్‌, ఎల్‌అండ్‌టీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

Next Story
Share it