మూడు రోజుల్లో వాళ్ల సంపద 5.76 లక్షల కోట్లు జంప్
మార్కెట్ ర్యాలీ. మూడు రోజులు. అంతే. ఇన్వెస్టర్ల సంపద ఈ మూడు రోజుల్లోనే ఏకంగా 5.76 లక్షల కోట్ల రూపాయల మేర పెరిగింది. ప్రపంచంలోనే అత్యుత్తమ రిటర్న్స్ ఇచ్చిన మార్కెట్ గా భారతీయ స్టాక్ మార్కెట్లు నిలిచినట్లు ఇటీవలే వార్తలు వచ్చాయి. అందుకు సంకేతంగా అన్నట్లు సోమవారం నాడు మార్కెట్లు మరోసారి దూసుకెళ్ళాయి. బీఎస్ఈలో నమోదు అయిన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో 247 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది.
బీఎస్ ఈ సెన్సెక్స్ ఏకంగా 765 పాయింట్ల లాభంతో కొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 56,889 పాయింట్లకు చేరింది. నిఫ్టీ కూడా 225 పాయింట్ల లాభంతో 16931 పాయింట్ల వద్ద ముగిసింది. పలు కీలక షేర్లు భారీ లాభాలతో ముగిశాయి. కరోనా కష్టకాలంలోనూ గత కొంత కాలంగా మార్కెట్లు దూకుడు చూపిస్తున్నాయి. బయట వ్యాపారాలు ఏమంత ఆశాజనకంగా లేకపోవటంతో ఎక్కువ మంది స్టాక్ మార్కెట్ వైపు మళ్ళారనే వార్తలు కూడా వచ్చాయి. ఇదే కారణంతో పెద్ద ఎత్తున కొత్త డీమ్యాట్ ఖాతాలు కూడా తెరిచారు.