233 లక్షల కోట్లకు బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్
కరోనా కష్టాలు ఉన్నా స్టాక్ మార్కెట్లలో మాత్రం దూకుడు ఆగటం లేదు. మార్కెట్లు వరస పెట్టి కొత్త కొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. బుధవారం నాటి ముగింపు లెక్కల ప్రకారం బీఎస్ ఈలో నమోదు అయిన షేర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా 233 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. ఇది రికార్డు గరిష్ట స్థాయి. తాజాగా ఐటి షేర్ల ర్యాలీ సాగిన విషయం తెలిసిందే. ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి సంస్థల ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటం..భవిష్యత్ కూడా ఆశాజనకంగా ఉండటంతో ఈ ర్యాలీ సాధ్యమైందని చెబుతున్నారు. ఒక్క బుధవారం నాడే పెట్టుబడిదారుల సంపద ఏకంగా 1.42 లక్షల కోట్ల రూపాయల మేర పెరిగింది. గతంతో పోలిస్తే మార్కెట్లలోకి నిధుల ప్రవాహం గణనీయంగా పెరిగింది.
కరోనా కారణంగా బయట వ్యాపారాలుచేసుకునే అవకాశాలు పెద్దగా లేకపోవటంతో ఎక్కువ నిదులు ఉన్న వారు స్టాక్ మార్కెట్ ను ఆశ్రయిస్తున్నారు. ఇదే కారణంగా గత ఏడాదిన్నర కాలంలో డీమ్యాట్ ఖాతాల సంఖ్య కూడా అనూహ్యంగా పెరిగింది. ఈ కారణంగానే ఆర్ధిక వ్యవస్థతో సంబంధం లేకుండా స్టాక్ మార్కెట్ల కదలికలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే కరోనా పూర్తిగా తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రం పెట్టుబడుల ఉపసంహరణ భారీగా ఉంటుందని..ఆ సమయంలో మార్కెట్ల పతనం ఎలా ఉంటుందో ఊహించటం కష్టం అని ఓ నిపుణుడు అభిప్రాయపడ్డారు.