లక్ష లోపు కు దిగి రావటం సాధ్యమేనా?

బంగారం ధరలు గతంలో ఎన్నడూ లేని రీతిలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. దీని వెనక చాలా కారణాలే ఉన్నాయి. ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే దేశంలో 10 గ్రాముల బంగారం ధర రికార్డు స్థాయిలో లక్ష ఎనభై వేల రూపాయలు దాటి రికార్డు నమోదు చేసింది. అక్కడ నుంచి వరసగా పతనం అవుతూ వస్తోంది. ప్రస్తుతం పది గ్రాముల బంగారం ధర లక్ష ఏభై ఆరు వేల రూపాయల వద్ద కొనసాగుతోంది. గత కొన్ని నెలలుగా స్టాక్ మార్కెట్ లో అనిశ్చితి కొనసాగుతోంది. పలు రంగాలకు చెందిన షేర్లు భారీ ఎత్తున పతనం అవుతున్నాయి. ఈ తరుణంలో కొత్తగా ఇన్వెస్ట్మెంట్ వైపు దృష్టి సారించిన వాళ్ళు సైతం బంగారం కొనుగోళ్ల వైపు మొగ్గు చూపించారు. ముఖ్యంగా యువత సొంతంగానే బంగారం కొనుగోలు పై నిర్ణయం తీసుకుని ...అందుబాటులో ఉన్న నిధులతోనే ఇందులో పెట్టుబడి పెడుతున్నారు అని ఒక నివేదిక వెల్లడించింది. రియల్ ఎస్టేట్ మార్కెట్ డల్ గా ఉండటం...స్టాక్ మార్కెట్ లో పతనం వంటి అంశాల కారణంగా ఎక్కువ మంది బంగారం కొనుగోళ్లపై ఫోకస్ పెట్టారు. ఇటీవల ధర అనూహ్యంగా పెరగటానికి కారణాల్లో ఇది కూడా ఒకటి. ప్రజల కొనుగోళ్ల కంటే కూడా డాలర్ పై ఆధారపడటం తగ్గించుకోవటం కోసం అని ఇండియా తో పాటు పలు దేశాలు భారీ ఎత్తున బంగారం కొనుగోళ్లు చేసినట్లు నివేదికలు చెపుతున్నాయి.
ఈ తరుణంలో బంగారం ధరలకు సంబంధించి ఒక సంచనల వార్త బయటకు వచ్చింది. అది ఏంటి అంటే పది గ్రాముల బంగారం ధర రాబోయే రోజుల్లో లక్ష రూపాయలకు వచ్చే అవకాశం ఉంది అనే వార్తలు రావటం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. నిజంగా ఇదే జరిగితే అధిక ధరల వద్ద బంగారంలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు భారీ ఎత్తున నష్టాలు మూటకట్టుకోవాల్సి వస్తుంది. అయితే బంగారం ధర లక్ష రూపాయలకు దిగువకు రావాలంటే ఇందులో పలు అంశాలు ముడిపడి ఉన్నాయి. ఇందులో అత్యంత కీలకమైన అంశం రష్యా తన వైఖరి మార్చుకుని అమెరికా డాలర్‌తో తిరిగి వాణిజ్యం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సిద్ధం అయితేనే ఇది జరిగే అవకాశం ఉంటుంది. అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ రకరకాల అస్త్రాలు ప్రయోగించి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలను తన దారిలోకి తెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. కొన్ని సంవత్సరాలుగా సాగుతున్న రష్యా-యుక్రెయిన్ యుద్దానికి ముగింపు పలికేందుకు కూడా డోనాల్డ్ ట్రంప్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. జూన్ నాటికీ ఈ యుద్దానికి బ్రేకులు పడి...అమెరికా తో రష్యా డాలర్ తో వ్యాపారం చేయటానికి సిద్ధపడితే ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు తగ్గుతాయి అని నిపుణులు అంచనా వేస్తున్నారు.
రష్యా ఇకపై డాలర్‌లో ట్రేడింగ్ చేసేందుకు అంగీకరించిందని, అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఒక్క కారణంతో బంగారం ధర ర్యాలీకి ముగింపు రానుందని చెబుతున్నారు. రష్యాకు చెందిన ఇంటర్నేషనల్ డాక్యుమెంటులో ఈ మేరకు డాలర్ వాణిజ్యానికి రష్యా సిద్ధమైనట్లు మీడియా లో వార్తలు వచ్చాయి. రష్యా తీసుకుంటున్న ఈ నిర్ణయం డాలర్‌కు ప్రత్యామ్నాయ కరెన్సీ తీసుకువచ్చి డీ-డాలరైజేషన్ చేయాలనే బ్రిక్స్ దేశాల ప్రయత్నాలకు బ్రేక్ లు పడే అవకాశం ఉంది. బ్రిక్స్ లో ఇండియా తో పాటు బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా లు ఉన్న విషయం తెలిసిందే. బ్రిక్స్ దేశాలు డాలర్‌ను ఎదుర్కొనేందుకు బంగారాన్ని భారీగా కొంటున్నాయని, తమ ట్రేడ్ సెటిల్మెంట్లలో డాలర్‌కి బదులుగా బంగారాన్ని వినియోగించాలని యోచిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు రష్యా అమెరికా డాలర్‌కి మారిపోతే అది డీ-డాలరైజేషన్, బంగారం ధరల ర్యాలీకి ప్రతిబంధకంగా మారే అవకాశం ఉంది అని... దీంతో బంగారం ధరలు కుప్పకూలే అవకాశాలు ఉన్నాయి అన్నది నిపుణుల అంచనాగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బంగారం నిల్వల్లో ఇరవై శాతం బ్రిక్స్ దేశాల వద్దే ఉంది. అయితే ఇది అంతా సాఫీగా జరిగినా కూడా ఇది అమల్లోకి రావటానికి 2027 వరకు పట్టొచ్చు అని చెపుతున్నారు. ఈ లోగా అంతర్జాతీయ పరిస్థితుల్లో ఎన్ని మార్పులు వస్తాయో చూడాలి. రాబోయే రోజుల్లో బంగారం మార్కెట్ లో ఒడిడుకులు కొనసాగే అవకాశం ఉంది అని ఎక్కువ మంది నిపుణులు అంచనా వేస్తున్నారు.



