Telugu Gateway
Top Stories

హోం మంత్రిపై సీబీఐ విచారణ

హోం మంత్రిపై సీబీఐ విచారణ
X

దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన నెలకు వంద కోట్ల రూపాయల 'లంచాల టార్గెట్' ఆరోపణల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈ అంశంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ ముంబయ్ మాజీ పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్ తొలుత సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు ఈ అంశంపై హైకోర్టులోనే పిటీషన్ వేయాలని ఆయన వినతిని తోసిపుచ్చింది. పరమ్ బీర్ సింగ్ తోపాటు మరికొంత మంది ఇదే అంశంపై దాఖలు చేసిన పిటీషన్లపై విచారణ జరిపిన ముంబయ్ హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. మహారాష్ట్ర హోం శాఖ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై విచారణ జరిపి 15 రోజుల్లో ప్రాథమిక నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

ఆధారాలు లభిస్తే ఈ అంశంపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయాలని పేర్కొంది. దీని తర్వాత తదుపరి ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొంది. ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ నివాసం వద్ద కారులో పేలుడు పదార్ధాలు పెట్టిన కేసులో అరెస్ట్ అయిన పోలీసు అధికారి సచిన్ వాజేకు హోం మంత్రి దేశ్ ముఖ్ ఈ టార్గెట్ ఇచ్చారని పరమ్ బీర్ సింగ్ ఏకంగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాశారు. ముంబయ్ లోని వైన్ షాప్ లు, బార్ అండ్ రెస్టారెంట్ల నుంచి నెలకు టార్గెట్ ఫిక్స్ చేసి వసూళ్ళు చేయాలని ఆదేశించినట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ముంబయ్ హైకోర్టు ఆదేశాలతో మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వంపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.

Next Story
Share it