భారీ పతనం

మూడున్నర సంవత్సరాల తర్వాత చమురు ధరలు బ్యారెల్ వంద డాలర్లను అధిగమించాయి . దీనికి ప్రధాన కారణం అమెరికా, ఇజ్రాయెల్ లు సంయుక్తంగా ఇరాన్ పై చేస్తున్న యుద్ధమే అన్న విషయం తెలిసిందే. ఈ దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా ఎదురుదాడికి దిగటంతో పశ్చిమాసియాలో ఇప్పుడు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అమెరికా-ఇరాన్ యుద్ధం రెండవ వారంలోకి ప్రవేశించడంతో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భయానక వాతావరణం నెలకొంది. మరో వైపు ఇరాన్ ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మోజ్ జల సంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఎవరైనా కాదు అని రవాణాకు ముందుకు వస్తే ఈ నౌకలను పేల్చివేస్తామని కూడా ఇరాన్ హెచ్చరించింది. దీంతో చమురు రవాణా విషయంలో కూడా అనిశ్చిత వాతావరణం నెలకొంది. అన్నీ కలిసి ముడి చమురు పెరుగుదలకు కారణం అయింది. ఒక్క మాటలో చెప్పాలంటే తాజా పరిణామాలు అన్నీ కూడా స్టాక్ మార్కెట్ తో పాటు ఆయిల్ మార్కెట్ లో కూడా అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ సృష్టిస్తున్న విధ్వంసం ఇది అనే అభిప్రాయం నెలకొంది.
కొన్ని రోజులు టారిఫ్ ల పేరుతో ప్రపంచ మార్కెట్లతో ఆడుకున్నాడు. ఇప్పుడు ఇరాన్ పై యుద్ధంతో మరోసారి స్టాక్ మార్కెట్ లో కల్లోలాలని కారణం అవుతున్నాడు. అమెరికా, ఇజ్రాయెల్ లు సంయుక్తంగా ఇరాన్ పై చేస్తున్న యుద్ధం కారణంగా గత కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్ లు కుప్పకూలుతున్న విషయం తెలిసిందే. సోమవారం నాడు అంటే మార్చి 9 న భారతీయ మార్కెట్లో బ్లడ్ బాత్ నెలకొంది అనే చెప్పాలి. ఎందుకంటే ఓపెనింగ్ లోనే ఏకంగా బిఎస్ఈ సెన్సెక్స్ 2400 పాయింట్ల మేర నష్టపోయింది. ఆ రంగం ...ఈ రంగం అని తేడా లేకుండా అన్ని షేర్లు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ లు చేస్తున్న ఈ యుద్ధం ఎప్పటికి ఆగుతుంది అనే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేకపోవటంతో ప్రపంచ మార్కెట్లలో తీవ్ర ఆందోళన నెలకొంది. మరో వైపు గత కొన్ని సంవత్సరాల్లో ఎన్నడూ లేని రీతిలో చమురు బ్యారెల్ ధర వంద డాలర్లను దాటటంతో మార్కెట్ సెంటిమెంట్ పై తీవ్ర ప్రభావం చూపించింది.
2022 జులై తర్వాత చమురు బ్యారెల్ ధర ఈ రేంజ్ కు చేరటం ఇదే మొదటి సారి. ఈ కారణంతోనే మార్కెట్ లు సోమవారం నాడు కుప్పకూలాయి. నిఫ్టీ కూడా 23800 పాయింట్ల దిగువకు చేరుకుంది. ఒక్క భారత్ లోనే కాదు జపాన్ నిక్కి కూడా చమురు బ్యారెల్ ధర వంద డాలర్లు దాటినట్లు వార్తలు రావటంతో ఏకంగా 4000 పాయింట్లు పతనం అయింది. ఇది ప్రపంచ మార్కెట్లలో అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ సృష్టిస్తున్న విధ్వంసంగానే ఎక్కువ మంది అబిప్రాయపపడుతున్నారు. చమురు ధరలు అధిక రేట్ల వద్ద ఎక్కువ రోజులు కొనసాగితే ఆ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల ఆర్ధిక వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉండంటంతో మార్కెట్ లు తీవ్రంగా రియాక్ట్ అయ్యాయి.



