పశ్చిమ బెంగాల్ లో బీజేపీ రికార్డు విజయం

తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువగా టార్గెట్ చేసుకుంది అంటే పశ్చిమ బెంగాల్ ఎన్నికలపైనే అని చెప్పొచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా టిఎంసి ని దెబ్బకొట్టి పశ్చిమ బెంగాల్లో లో కాషాయ జెండా ఎగరేయాలి అనే బీజేపీ ప్లాన్స్ ఇప్పటి వరకూ ఫలించలేదు. ఈ సారి ఏ మాత్రం గురి తప్పకూడదు అనేలా స్కెచ్ వేసిన బీజేపీ అందుకు అనుగుణంగానే పావులు కదిపి విజయవంతం అయింది. ఒక్క మాటలో చెప్పాలంటే టార్గెట్ పెట్టుకుని మరీ టిఎంసి ను బీజేపీ దెబ్బకొట్టింది అనే చెప్పాలి. గత పదిహేను సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్ లో అధికారం చెలాయిస్తూ వచ్చిన టిఎంసి ప్రభుత్వంపై పెరిగిన అసంతృప్తికూడా బీజేపీ కి కొంత వరకూ కలిసి వచ్చింది. దీనికి తోడు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) వంటి అంశాలు కూడా టి ఎంసి కి ఇబ్బందిగా మారాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల ముందు సర్ చేపట్టడం సరికాదు అని...బీజేపీ గెలుపు కోసం ఇష్టానుసారం ఓటర్లను తొలగిస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేసింది..ఇదే అంశంపై సుప్రీం కోర్ట్ వరకూ కూడా వెళ్లి పోరాడారు. అయినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్ లో అధికారులను మార్చివేసింది. ఎన్నికలు జరిగిన ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పశ్చిమ బెంగాల్ లో జరిగిన బదిలీలు...మార్పులు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవి అన్ని కూడా ఒక పధకం ప్రకారం టార్గెట్ గా చేసినవే అనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు దేశంలో ఏ రాష్ట్రంలో దింపని విధంగా ఈ ఎన్నికల కోసం ఏకంగా 2 . 4 లక్షల మంది కేంద్ర సాయుధ బలగాలను పశ్చిమ బెంగాల్ లో మోహరించారు. ఇలా ఒకటేమిటి ఏ అవకాశాన్ని కూడా వదలకుండా బీజేపీ తమ వ్యూహాలను అమలు చేసి ఈ సారి పక్కాగా విజయం సాధించింది.
మరో వైపు మమతా బెనర్జీ ని దెబ్బకొట్టాలంటే కేవలం ఇవి మాత్రమే సరిపోవు అని...ఉచిత పథకాలపై విమర్శలు గుప్పించే బీజేపీ పశ్చిమ బెంగాల్ లో గెలుపు కోసం ఎడా పెడా ఉచిత హామీలు కూడా ఇచ్చింది. టిఎంసి ప్రస్తుతం రాష్ట్రంలో మహిళలకు 1500 రూపాయలు అందిస్తుంటే...బీజేపీ ఏకంగా ఈ మొత్తాన్ని మూడు వేల రూపాయలు ఇస్తామని మేనిఫెస్టో లో ప్రకటించింది. ఉచిత బస్సు సౌకర్యంతో పాటు ఇంకా ఎన్నో పధకాలు కూడా ప్రకటించారు. ప్రధాని మోడీ తో పాటు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా లు ఇతర రాష్ట్రాల కంటే పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టి టార్గెట్ కంప్లీట్ చేశారు. సోమవారం నాడు వెల్లడైన ఫలితాల్లో బీజేపీ ఊహించిన దాని కంటే భారీ మెజారిటీ తో విజయం సాధించింది. సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయానికి బీజేపీ ఏకంగా 195 సీట్లు గెలుచుకుని...13 సీట్ల లో లీడ్ లో ఉంది. టిఎంసి మాత్రం 70 సీట్లు గెలుచుకుని తొమ్మిది సీట్లలో లీడ్ లో ఉంది. ఎన్నికలు జరిగిన 293 నియోజకవర్గాల్లో బీజేపీ ఏకంగా 208 సీట్లు గెలుచుకునే దిశగా సాగుతోంది. ఇది బీజేపీ కి భారీ భారీ విజయం అనే చెప్పాలి.



