Telugu Gateway
Top Stories

బిల్ గేట్స్ సంచలనం..27 ఏళ్ళ పెళ్లి బంధానికి తెర

బిల్ గేట్స్ సంచలనం..27 ఏళ్ళ పెళ్లి బంధానికి తెర
X

సంచలనం. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఒకటైన టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ విడాకులు తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ వ్యవహారం పెద్ద సంచలంగా మారింది. మిలిందా గేట్స్‌ తో వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ఆయన వెల్లడించారు. తామిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని, అయితే సామాజిక కార్యక్రమాల్లో మాత్రం భాగస్వాములుగానే కొనసాగుతామని తెలిపారు. బాగా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సతీమణి మిలిందా గేట్స్‌ తో కలిసి ట్విటర్‌ వేదికగా సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ''మా బంధం కొనసాగాలా లేదా అన్న అంశం గురించి పూర్తిగా ఆలోచించిన తర్వాత విడిపోవాలనే నిర్ణయానికివచ్చాం. గత 27 ఏళ్ల బంధంలో ముగ్గురు పిల్లలను పెంచి పెద్ద చేశాం.

ఫౌండేషన్‌ స్థాపించి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు ఆరోగ్యవంతులుగా, మెరుగైన జీవనం గడిపేలా మా వంతు కృషి చేశాం. ఈ మిషన్‌ ఇలాగే కొనసాగిస్తాం. ఫౌండేషన్‌ కోసం కలిసి పనిచేస్తాం. అయితే, మా జీవితంలోని తదుపరి దశలో దంపతులుగా మాత్రం కొనసాగలేం. దయచేసి కొత్త జీవితం ప్రారంభించబోతున్న మాకు, మా కుటుంబ ప్రైవసీకి భంగం కలిగించవద్దని మనవి'' అని మిలిందా, బిల్‌ గేట్స్‌ విజ్ఞప్తి చేశారు. బ్లూమ్‌బర్గ్‌ తాజా నివేదిక ప్రకారం బిల్‌ గేట్స్‌ సంపద ప్రస్తుతం 124 బిలియన్‌ డాలర్లు. కాగా 1970లో ప్రారంభమైన మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు అయిన ఆయన.. 1987లో తొలిసారిగా ప్రపంచ సంపన్నుడిగా ఫోర్బ్‌ జాబితాలో స్థానం దక్కించుకున్నారు. 24 ఏళ్ల పాటు అదే స్థానంలో కొనసాగారు. ప్రస్తుతం బిల్‌గేట్స్‌ అత్యంత ధనవంతుల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నారు.

Next Story
Share it