పేటీఎం కు మరో షాక్..టార్గెట్ ధర 450 రూపాయలు!
ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన పేటీఎం మదుపర్లకు మరో షాక్. ఇప్పటికే ఈ షేరు ఆఫర్ ధర 2150 రూపాయల కంటే దారుణంగా పడిపోయింది. ఈ గురువారం నాడు 38 రూపాయల నష్టంతో 596 రూపాయల వద్ద ముగిసింది. పతనం అయిన ప్రతి దశలోనూ కొంత మంది మదుపర్లు ఎప్పుడో ఒక రోజు ఆఫర్ ధరకు చేరకపోతుందా అనే ఆశతో కొనుగోళ్ళు చేశారు. చాలా మంది వెయ్యి రూపాయల వద్ద కొనుగోళ్లు చేసిన వారు కూడా ఉన్నారు. అయితే మధ్యలో అప్పుడప్పుడు అలా పెరగటం తప్ప..లిస్టింగ్ తర్వాత ఈ షేరు వరస పెట్టి పతన బాటలోనే సాగుతోంది. తొలుత ఈ షేరు ధర 700 రూపాయల వద్ద నిలదొక్కుకుంటుందని వార్తలు వచ్చాయి. కానీ దాన్ని కూడా బ్రేక్ చేసి కిందకు పడిపోతూనే ఉంది.
రాబోయే రోజుల్లో మరింత గడ్డుకాలం ఉన్నందున పేటీఎం షేరు 450 రూపాయలకు రావొచ్చని మాక్వైరీ తాజాగా అంచనా వేసింది. ఇది అలాట్ మెంట్ లో ఈ షేర్లను పొందిన వారికి పెద్ద షాక్ కిందే లెక్క. దేశంలోనే అతి పెద్ద ఐపీవోగా నిలిచిన పేటీఎం మార్కెట్ విలువ లక్ష కోట్ల రూపాయల నుంచి 38,671.50 కోట్ల రూపాయలకు తగ్గింది. ఆర్ బిఐ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై పలు అనుమానాలు లేవనెత్తటం, ఈ కంపెనీలపై చైనా సంస్థలకు వాటాలు ప్రతికూలంగా మారాయి. ఫిన్ టెక్ కంపెనీలు పలు సవాళ్ళు ఎదుర్కొంటున్నాయి. అయితే మోర్గాన్ స్టాన్లీ మాత్రం పేటీఎం షేరు ధర పెరుగుతుందని చెబుతోంది. మార్చి16న మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలోపేటీఎం వ్యాపార పరిస్థితులు మెరుగుపడుతున్నాయని..దీంతో మార్జిన్లు..లాభాలు పెరగుతాయని పేర్కొంది.