మళ్ళీ టెండర్లు పిలుస్తారా..స్టే ఇవ్వాలా చెప్పమన్న సుప్రీం

ప్రభుత్వం ఏదైనా టెండర్ మాత్రం మేఘా ఇంజనీరింగ్ కంపెనీదే. ఆంధ్ర ప్రదేశ్ లో గత జగన్ ప్రభుత్వం అయినా...ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అయినా అదే పరిస్థితి. తెలంగాణలో కూడా అందుకు భిన్నమైన వాతావరణం ఏమి లేదు. బిఆర్ఎస్ పదేళ్ల కాలంలో ఈ కంపెనీ దక్కిన పనులు ఎన్నో. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు కూడా మేఘా కి జీ హుజుర్ అంటోంది. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇదే కంపెనీపై ఎన్నో మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. ఆ కంపెనీకి పెద్ద ఎత్తున కాంట్రాక్టులు ఇస్తున్నట్లు కూడా విమర్శలు ఎదుర్కొంటున్నారు. దేశ వ్యాప్తంగా హవా చెలాయిస్తున్న మేఘా ఇంజనీరింగ్ కు ఇప్పుడు పెద్ద దెబ్బ పడింది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ (ఎంఎం ఆర్ డీఏ ) పిలిచిన టెండర్లలో ఈ కంపెనీ రెండు పనులు దక్కించుకుంది. వీటి విలువ ఏకంగా 14000 కోట్ల రూపాయలు. ఇక్కడ విచిత్రం ఏమిటి ఇవే పనులకు కోసం దేశ, విదేశాల్లో ఎన్నో సంక్లిష్టమైన ప్రాజెక్ట్ లు చేసిన దిగ్గజ ఇంజనీరింగ్ కంపెనీ లార్సన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టి) కూడా బిడ్ వేసింది. అయితే ఎంఎంఆర్ డీఏ ఎలాంటి కారణాలు చెప్పకుండా సాంకేతిక బిడ్స్ దశలోనే ఎల్ అండ్ టి పై అనర్హత వేటు వేసింది.
దీనిపై కంపెనీ ముంబై హై కోర్టు ను ఆశ్రయించినా ఊరట దక్కకపోవడంతో సుప్రీం కోర్టు ను ఆశ్రయించింది. ఎల్ అండ్ టి వంటి కంపెనీ ని సాంకేతిక బిడ్స్ దశలోనే తిరస్కరించటం పై చీఫ్ జస్టిస్ గవాయి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ టెండర్లను రద్దు చేస్తారా లేదా వీటిపై స్టే ఇవ్వమంటారా చెప్పండి అంటూ ఆయన ఎంఎంఆర్ డీఏ తరపున హాజరు అయిన వాళ్ళను కోరారు. ప్రభుత్వంతో మాట్లాడి ఈ విషయం చెప్పాలన్నారు. మే 26 , మే 29 తేదీల్లో ఈ అంశంపై వాదనలు జరిగాయి. అయితే శుక్రవారం నాడు చీఫ్ జస్టిస్ గవాయి, జస్టిస్ ఏ జి మసీహ్, ఏ ఎస్ చందూర్కర్ లతో కూడిన బెంచ్ కు ఈ రెండు టెండర్లను రద్దు చేస్తున్నట్లు ముకుల్ రోహత్గి వెల్లడించారు. ఇవే టెండర్లలో హైదరాబాద్ కు చెందిన మేఘా ఇంజనీరింగ్ ఎల్ 1 గా నిలిచింది. దీంతో ఇప్పుడు కంపెనీకి దక్కిన 14000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ లు పోయినట్లు అయింది. ముంబై కోస్టల్ రోడ్ ప్రాజెక్ట్ విస్తరణ లో భాగంగా దగ్గర దగ్గర 8000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఐదు కిలోమీటర్ల మేర ట్విన్ టన్నెల్ ప్రాజెక్ట్ , 6000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఎలివేటెడ్ క్రీక్ రోడ్ బ్రిడ్జి పనుల కోసం టెండర్లు పిలిచారు.
అయితే ఎల్ అండ్ టి ని పక్కన పెట్టి ప్రైస్ బిడ్స్ కూడా ఓపెన్ చేశారు. అయితే ఎల్ అండ్ టి మాత్రం ఎల్ 1 వచ్చిన మేఘా ఇంజనీరింగ్ కంపెనీ కంటే తాము రెండు పనులకు కలుపుకుని 3130 కోట్ల రూపాయల మేర లెస్ కు వేశామని చెపుతోంది. ఎల్ అండ్ టి ని తిరస్కరించటానికి అవసరమైన అన్ని కారణాలు ఉన్నాయని...చెప్పి ఇప్పుడు సుప్రీం కోర్టు జోక్యం తో టెండర్లను పూర్తిగా రద్దు చేశారు. ఈ టెండర్లు రద్దు చేయకపోతే తాము క్లాజులతో పాటు మొత్తం మెరిట్స్ చూస్తామని..విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్టా నిర్ణయం తీసుకుంటామన్నారు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది అని చెపుతున్నారు.



