భారత్ బయోటెక్ కు బిగ్ షాక్!
వ్యాక్సిన్ సరఫరా ఒప్పందాన్ని రద్దు చేసుకోనున్న బ్రెజిల్
దేశానికి చెందిన ప్రముఖ వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ కు పెద్ద ఎదురుదెబ్బ తప్పేలా లేదు. బ్రెజిల్ ఈ సంస్థతో కుదుర్చుకున్న వ్యాక్సిన్ సరఫరా ఒప్పందాన్ని రద్దు చేసుకునే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. రెండు కోట్ల వ్యాక్సిన్ల సరఫరాకు సంబంధించి 324 మిలియన్ డాలర్ల డీల్ కుదిరిన విషయం తెలిసిందే. అయితే భారత్ బయోటెక్ కు మధ్యవర్తిగా వ్యవహరించిన కంపెనీపై తీవ్ర విమర్శలు ఉండటం..ఆ సంస్థ గత చరిత్ర కూడా వివాదస్పదం అయింది. అదే సమయంలో అందుబాటులో ఉన్న ఇతర వ్యాక్సిన్లతో పోలిస్తే ఈ సంస్థ వ్యాక్సిన్లకు కూడా ఎక్కువ ధర చెల్లిస్తున్నారనే విమర్శలు వచ్చాయి. అక్రమాల ఆరోపణల నేపథ్యంలో బ్రెజిల్ ప్రెసిడెంట్ జైర్ బోల్సినారో ఈ ఒప్పందం రద్దుకు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి.
ఈ వ్యవహారం బొల్సినారోకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇది ప్రజల్లోకి బలంగా వెళ్ళటంతో అక్రమాలు జరిగాయనే హెచ్చరికలు కూడా అందాయి. బ్రెజిల్ వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఓ అధికారి తన ఆందోళనలను బ్రెజిల్ ప్రెసిడెంట్ కు వ్యక్తిగతంగా వివరించారు. కంట్రోలర్ జనరల్ ఆప్ యూనియన్ (సీజీయూ) ప్రాథమిక విశ్లేషణలో కాంట్రాక్టులో ఎలాంటి ఉల్లంఘనలు ఉన్నట్లు నిర్ధారణ కాలేదని..అయినా మరింత లోతైన పరిశోధన కోసం వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ రద్దుకే మొగ్గు చూపింది. బ్రెజివిల్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఈ విషయంలో విచారణ సాగిస్తున్నారు. ఈ ఒప్పందానికి సంబంధించి వేగంగా చర్చలు సాగటం, అధిక ధరలు, నియంత్రణా సంస్థల అనుమతులకు ముందే ఒప్పందాలువంటివి ప్రతికూల అంశాలుగా మారినట్లు గుర్తించారు.