Telugu Gateway
Top Stories

యాపిల్ విలవిల

యాపిల్ విలవిల
X

ఒకే ఒక నిర్ణయం. యాపిల్ వంటి కంపెనీ ని కూడా విలవిల లాడేలా చేసింది. చైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో యాపిల్ కంపెనీ ఇప్పుడు వణుకుతోంది. కేవలం రెండు అంటే రెండు రోజుల్లోనే ఈ కంపెనీ షేర్లు 200 బిలియన్ డాలర్లు అంటే మన భారతీయ కరెన్సీ లో చూసుకుంటే దగ్గరదగ్గర పదిహేడు లక్షల కోట్ల రూపాయల మేర నష్టపోయాయి. ఇది మొత్తం యాపిల్ కంపెనీ విలువలో ఆరు శాతానికి సమానం. తాజాగా చైనా సర్కారు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ ఆఫీస్ లకు యాపిల్ ఫోన్లు తీసుకురావద్దు అని ఆదేశించింది. ఒక్క యాపిల్ మాత్రమే కాదు ఏ విదేశీ ఫోన్లు తీసుకుని రాకూడదు అని ప్రకటించింది. ఈ విషయాన్నీ అమెరికా పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ బహిర్గతం చేసింది. ఆ తర్వాత ప్రభుత్వ ఆధీనంలోని కంపెనీల్లో పని చేసే వారు కూడా యాపిల్ తో పాటు విదేశీ కంపెనీ ల ఫోన్ల తో రావొద్దు అని పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. ఇదే యాపిల్ షేర్ల భారీ పతనానికి కారణం అయింది.

యాపిల్ కు చైనా అతి పెద్ద మార్కెట్ల లో ఒకటి. కంపెనీ ఆదాయంలో సుమారు 18 శాతం మేర చైనా నుంచే వస్తుంది. చైనా లో యాపిల్ కు అతి పెద్ద ఐ ఫోన్ల తయారీ యూనిట్ కూడా ఉన్న విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అత్యధిక మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీ యాపిల్. యాపిల్ త్వరలోనే ఐ ఫోన్ 15 విడుదల చేసే సన్నాహాల్లో ఉన్న తరుణంలో ఈ పరిణామాలు ఆ కంపెనీ ని షాక్ కు గురి చేశాయని చెప్పాలి. గత కొంత కాలంగా అమెరికా -చైనా ల మధ్య వాణిజ్య వార్ నడుస్తోంది. ఒకరిపై ఒకరు పై చేయి సాధించే ఎత్తుగడలు వేసుకుంటున్నాయి. అయితే ఈ పరిణామాలు ఇంకెన్ని మలుపులు తీసుకుంటేనే టెన్షన్ యాపిల్ లో ఉంది. చిప్ ల తయారీకి సంబదించిన సాంకేతిక పరిజ్ఞాన బదిలీ విషయంలో అమెరికా, దాని మిత్ర దేశాలు చైనా పై నియంత్రణలు విధించాయి. దీనికి కౌంటర్ గా చైనా కూడా చిప్ ల తయారీలో వాడే కొన్ని కీలక పదార్దాల ఎగుమతులను నిలిపివేసింది.

Next Story
Share it