భారీ ర్యాలీకి కారణాలు ఇవే!

మార్కెట్ కు ఈ సోమవారం అన్ని మంచి శకునములే. ఈ ప్రభావం తో దేశీయ స్టాక్ మార్కెట్ లు దుమ్ము రేపుతున్నాయి. గత కొన్ని రోజులుగా భారత్ -పాకిస్థాన్ ల మధ్య ఉద్రిక్తతలకు తెరదించుతూ కాల్పుల విరమణ ప్రకటన రావటం మార్కెట్ సెంటిమెంట్ ను మెరుగుపర్చింది. యుద్ధం తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది అన్న భయంతో గత శుక్రవారం నాడు మార్కెట్లు పతనం అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు కాల్పుల విరమణ ప్రకటనతో పాటు అమెరికా, చైనా ల మధ్య టారిఫ్ వార్ కు సంబంధించి జరిగిన చర్చలు కూడా ఫలప్రదంగా ముగిసినట్లు వార్తలు వచ్చాయి.
అన్ని సానుకూల వార్తలే ఉండటంతో సోమవారం ప్రారంభం నుంచే అటు బిఎస్ఈ , ఇటు ఎన్ఎస్ఈ సూచీలు భారీ ఎత్తున లాభాలు గడించాయి. సరిగా సోమవారం పది గంటల సమయంలో బిఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 2230 పాయింట్ల లాభంతో 81685 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మరో వైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 677 పాయింట్ల లాభంతో 24685 పాయింట్ల వద్ద ఉంది. అన్ని కీలక షేర్లు కూడా పెద్ద ఎత్తున లాభాలు గడించాయి. రిలయన్స్ , ఎస్ బిఐ తో పాటు హెచ్ డిఎఫ్ సి బ్యాంకు, జియో ఫైనాన్సియల్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంకు లాభాల బాటలో సాగుతున్నాయి.



