మార్కెట్ లోకి బిగ్ ఐపీఓ ల క్యూ
ఇండియాలో ఇప్పటివరకు అతి పెద్ద ఐపీఓ అంటే ఎల్ఐసిదే. ఎల్ ఐసి స్టాక్ మార్కెట్ నుంచి 2022 సంవత్సరంలో 21000 కోట్ల రూపాయలు సమీకరించింది. ఈ రికార్డు ఐపీఓ తర్వాత చాలా రోజులు ఎల్ఐసి షేర్లు ఆఫర్ ధర కంటే దిగువనే ట్రేడ్ అయ్యాయి. కాకపోతే ప్రస్తుతం ఎల్ఐసి షేర్లు 1017 రూపాయల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఎల్ఐసి ని బీట్ చేసేలా ఇప్పుడు హ్యుండయ్ భారత్ లో అతి పెద్ద ఐపీఓ జారీ చేయనుంది. ఈ ఐపీఓ ద్వారా హ్యుండయ్ ఏకంగా 25000 కోట్ల రూపాయలు ప్రైమరీ మార్కెట్ నుంచి సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఈ ఇష్యూ కు సెబీ ఆమోదం రాగా..కంపెనీ అక్టోబర్ లోనే మార్కెట్ లోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.
ఈ ఇష్యూ పూర్తి అయితే దేశంలో అతి పెద్ద ఐపీఓ గా హ్యుండయ్ నిధుల సమీకరణ నిలవనుంది. హ్యుండయ్ మార్కెట్ నుంచి సమీకరించే నిధులతో దేశంలో తన కార్ల తయారీ యూనిట్స్ సామర్ధ్యాన్ని పెంచుకోనుంది. అదే సమయంలో దేశంలోనే సాధ్యమైనంత మేర ఎలక్ట్రిక్ కార్ల తయారీ పై కూడా ఫోకస్ పెట్టనుంది. మరో వైపు స్విగ్గీ కూడా భారీ ఐపీఓ తో మార్కెట్ లోకి రానుంది. ఈ సంస్థ మార్కెట్ నుంచి 12000 కోట్ల రూపాయలు సమీకరించేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే స్విగ్గీ ఐపీఓ కి సెబీ అనుమతి వచ్చినట్లు సమాచారం. ఇది కూడా అక్టోబర్ నెలాఖరు లేదా...నవంబర్ లో మార్కెట్ లోకి రానుంది. ఇప్పటికే ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో మార్కెట్ లోకి వచ్చి...ఇన్వెస్టర్లకు మంచి రిటర్న్స్ ఇచ్చిన విషయం తెలిసిందే.