Telugu Gateway
Top Stories

ఆస్ప‌త్రికి 120 కోట్ల భూమి దానం.. పేరు ర‌హ‌స్యం

ఆస్ప‌త్రికి 120 కోట్ల భూమి దానం.. పేరు ర‌హ‌స్యం
X

రెండు అర‌టి పండ్లు పంచుతూ కూడా ఫోటోలు దిగి ప్ర‌చారం చేసుకునే వాళ్ల‌ను చూస్తున్నాం. కొంత మంది విష‌యంలో సాయానికి ప్ర‌ధాన కార‌ణం కూడా ప్రచార‌మే. కానీ ఆ విష‌యం పైకి చెప్ప‌రు. ప్ర‌చారం ఆశించినా అర్హుల‌కు సాయం అందుతున్నందుకు సంతోషించాల్సిందే. కానీ ఈ సాయం మాత్రం అపూర్వం. అద్భుతం. పైన చెప్పుకున్న వాళ్ల‌కు పూర్తి భిన్నం. ల‌క్ష రూపాయ‌ల సాయం చేసి మ‌రీ ప‌ది ల‌క్షల ప్ర‌చారం తీసుకునే సెల‌బ్రిటీలు ఉన్న దేశంలో ఆమె నిర్ణ‌యం మాత్రం ఆశ్చ‌ర్యం క‌లిగించ‌క‌మాన‌దు. ముంబ‌య్ కు చెందిన మ‌హిళ ఒక‌రు ఏకంగా 120 కోట్ల రూపాయ‌ల విలువ చేసే స్థ‌లాన్ని ఆస్ప‌త్రికి దానం చేశారు. అందుకు ఆమె పెట్టిన ష‌ర‌తు త‌న పేరు ఎక్క‌డా బ‌య‌ట‌కు రావొద్ద‌ని. బంధుత్వాలు..స్నేహాలు అన్నీ వాణిజ్యాంశాలుగా మారిన ఈ రోజుల్లో ముంబ‌య్ లాంటి మ‌హాన‌గ‌రంలో 120 కోట్ల రూపాయ‌ల విలువ చేసే స్థ‌లం దానం ఇవ్వ‌టం అంటే ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. విచిత్రం ఏమిటంటే ఆ మ‌హిళ నిర్ణ‌యానికి ఆమె భ‌ర్త కానీ, బెంగుళూరులో ఐటి ఉద్యోగం చేసే కొడుకు కానీ ఏ మాత్రం అభ్యంత‌రం చెప్ప‌లేదు. వీరిది ఎగువ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం. స‌హ‌జంగా అంత ఖ‌రీదైన భూమి ఉంటే దాన్ని అమ్ముకునో లేదా డెవ‌ల‌ప్ మెంట్ కు ఇచ్చోఆ డ‌బ్బుతో విలాసాలు చేద్దామనుకుంటారు ఎవ‌రైనా. కానీ ఆమె మాత్రం అందుకు భిన్నంగా తాను చేయాల్సిన సాయం చేసి త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతుంది. ఈ విష‌యం ఆమె స‌న్నిహిత వ‌ర్గాల‌తోస‌హా చుట్టుప‌క్క‌ల వారికి కూడా తెలియ‌కుండా జాగ్ర‌త్త ప‌డింది.

దేశంలోనే అతి పెద్ద క్యాన్స‌ర్ ఇన్ స్టిట్యూట్ అయిన టాటా మెమోరియ‌ల్ ఆస్ప‌త్రికి ఆమె ఈ స్థ‌లాన్ని ఇచ్చేసింది. క్యాన్స‌ర్ గుర్తించిన త‌ర్వాత తొలి ద‌శ‌లో చికిత్స‌కు ఇక్క‌డకు వ‌చ్చే వారిలో 60 శాతం మందికి ఉచితంగా వైద్య సేవ‌లు అందిస్తారు. ఈ ఆస్ప‌త్రి ప‌క్క‌న‌..రోడ్ల మీద క్యాన్స‌ర్ బాధితులు ప‌డే ఇబ్బందులు చూసిన ఆ మ‌హిళ రోగుల‌కు ఉప‌యుక్తంగా ఉంటుంద‌ని భావించి ఆస్ప‌త్రి ప‌క్క‌నే కొత్త‌గా కీమో సెంట‌ర్ ఏర్పాటు చేయ‌టానికి వీలుగా ఈ 120 కోట్ల రూపాయ‌లు విలువ చేసే స్థ‌లం అప్పగించింది. త‌న త‌ల్లిదండ్రులు, త‌న‌కు గురువు నేర్పిన వారు సైతం చేసే సాయం ఎవ‌రికీ తెలియాల్సిన అవ‌స‌రం లేద‌ని త‌న‌కు నేర్పించార‌ని..అదే తాను ఫాలో అయ్యాయ‌ని ఆమె చెబుతోంది. అయితే ఇటీవ‌ల ఎలా త‌న పేరు బ‌య‌ట‌కు వ‌చ్చిందో ఇప్ప‌టికీ తెలియ‌టం లేద‌ని..ఇది త‌న‌కు చాలా ఇబ్బందిగా ఉంద‌ని ఆ మ‌హిళ 'హిందూస్థాన్ టైమ్స్ ' ప్ర‌తినిధితో వ్యాఖ్యానించారు. ఈ ప‌త్రిక‌కు చెందిన మాళ‌వికా సంఘ్వి ఈ ఆస‌క్తిక‌ర క‌థ‌నాన్ని వెలుగులోకి తెచ్చారు. అయితే త‌న పేరు బ‌య‌ట‌కు వెల్ల‌డించ‌వద్ద‌నే ష‌ర‌తుతో ఆమె ఈ ప‌త్రిక ప్ర‌తినిధితో ఈ వివ‌రాలు పంచుకున్నారు. త‌న బంధువు అయిన డాక్ట‌ర్ బ‌రూచ ఆస్ప‌త్రి ట్ర‌స్ట్ కి ఈ భూమి దానం చేయ‌టంలో స‌హ‌క‌రించిన‌ట్లు తెలిపారు. అయితే ఈ ప్ర‌క్రియ పూర్తి కావ‌టానికి రెండున్న‌ర సంవ‌త్స‌రాలు ప‌ట్టింద‌ని అన్నారు.

Next Story
Share it