Telugu Gateway
Top Stories

కోవాగ్జిన్ సేఫ్ ..మధ్యంతర నివేదిక

కోవాగ్జిన్ సేఫ్ ..మధ్యంతర నివేదిక
X

హైదరాబాద్ కేంద్రంగా ఉన్న భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ 'కోవాగ్జిన్' సురక్షితం అని తేలినట్లు ఆ కంపెనీ వెల్లడించింది. తొలి దశ ఫలితాలకు సంబంధించిన మధ్యంతర నివేదిక ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ కు సంబంధించి మూడో దశ క్లినికల్‌ పరీక్షలు జరుగుతున్నాయి. తొలి దశ క్లినికల్‌ పరీక్షల్లో కోవాగ్జిన్‌ ఎలాంటి ఇతర సమస్యలకూ తావివ్వలేదని కంపెనీ స్పష్టం చేసింది. తొలి, రెండు దశల క్లినికల్‌ పరీక్షల డేటా ఆధారంగా కంపెనీ వ్యాక్సిన్ అనుమతుల కోసం దరఖాస్తు చేయనుంది. వ్యాక్సిన్‌ భద్రత, ప్రభావం వంటి అంశాలపై మరింత విస్తృతంగా నిర్వహించనున్న మూడో దశ పరీక్షల ద్వారా మాత్రమే తగిన డేటా లభించగలదని వివరించింది. భారత్‌ బయోటెక్ 22,000 మందితో మూడో దశ క్లినికల్‌ పరీక్షలను నిర్వహిస్తోంది.

. ఇందుకు వీలుగా ఇప్పటికే 8,000 మందిని ఎంపిక చేసుకున్నట్లు కంపెనీ సీఎండీ కృష్ణ ఎల్లా తెలియజేశారు. కంపెనీ నవంబర్‌ 17న మూడో దశ పరీక్షలను ప్రారంభించింది. ఆగస్ట్‌లో ఒకే ఒక తీవ్ర సమస్య ఎదురైనట్లు భారత్‌ బయోటెక్‌ తెలియజేసింది. అయితే ఇది వ్యాక్సిన్‌ వల్లకాదని తేలినట్లు వివరించింది. 11 ఆసుపత్రులలో 375 మంది వాలంటీర్లపై తొలి దశ ప్రయోగాలు చేపట్టినట్లు తెలియజేసింది. మూడు విభిన్న డోసేజీలను ఇవ్వడం ద్వారా రోగ నిరోధక శక్తి అత్యుత్తమంగా స్పందించినట్లు పేర్కొంది. దేశీయ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగంగా జరిగే అవకాశం ఉంది. అంతే కాదు. ప్రభుత్వంపై పడే ఆర్ధిక భారం కూడా తగ్గే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.

Next Story
Share it