Telugu Gateway
Top Stories

భారత్ బయోటెక్ 'కోవాగ్జిన్' బూస్టర్ డోస్ ప్రయోగాలు ప్రారంభం

భారత్ బయోటెక్ కోవాగ్జిన్ బూస్టర్ డోస్ ప్రయోగాలు ప్రారంభం
X

ప్రపంచలో కరోనాకు ఇప్పటివరకూ సింగిల్ డోస్ వ్యాక్సిన్ తెచ్చింది జాన్సన్ అండ్ జాన్సన్ మాత్రమే. ఇప్పుడు రష్యాకు చెందిన స్పుత్నిక్ వి కి సంబంధించి కూడా స్పుత్నిక్ లైట్ పేరుతో సింగిల్ డోస్ వ్యాక్సిన్ తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. అమెరికాలో అత్యంత విజయవంతం అయిన వ్యాక్సిన్ గా పేరొందిన ఫైజర్, మోడెర్నాలు కూడా రెండు డోసుల వ్యాక్సిన్లనే అభివృద్ధి చేశాయి. భారత్ లో విస్తృతంగా ఉపయోగిస్తున్న ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనెకాల కోవిషీల్డ్ వ్యాక్సిన్ కూడా డబుల్ డోసే. దేశీయంగా భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కోవాగ్జిన్ కూడా డబుల్ డోసే అన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు భారత్ బయోటెక్ కోవాగ్జిన్ కు సంబంధించి బూస్టర్ డోస్ ప్రయోగాలు ప్రారంభించింది. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు అన్నీ ఏడాది పాటు మాత్రమే యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తాయని ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో కంపెనీ బూస్టర్ డోస్ రెడీ చేసేందుకు సిద్ధమైంది. గతంలోనే దీనికి సంబంధించిన విషయాలు వెల్లడించినా తాజాగా ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. అంటే ఈ లెక్కన కోవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్న వారు మూడు డోసులు వేయించుకోవాల్సి వస్తుంది అన్న మాట.

బూస్టర్ డోసు కు సంబంధించి 190 మందిపై ఆరు నెలల పాటు అధ్యయనం కొనసాగించనున్నారు. సోమవారం నాడు న్యూఢిల్లీలో ఎయిమ్స్ లో దీనికి శ్రీకారం చుట్టింది కంపెనీ. దేశంలో మొత్తం తొమ్మిది చోట్ల బూస్టర్ డోసు ప్రయోగాలు చేయనున్నారు. మూడో డోసు వ్యాక్సిన్ తీసుకున్న వారిపై ఆరు నెలల పాటు పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు వారిపై ఈ ప్రయోగాలు సాగనున్నాయి. బూస్టర్ డోసు ప్రయోగాల కోసం ఇప్పటికే భారత్ బయోటెక్ సబ్జెక్ట్ నిపుణుల కమిటీ (ఎస్ఈసీ) నుంచి అనుమతి పొందినట్లు తెలిపారు.

Next Story
Share it