Telugu Gateway
Top Stories

రాబోయే రోజుల్లో కీలక పరిణామాలు తప్పవా?!

రాబోయే రోజుల్లో కీలక పరిణామాలు తప్పవా?!
X

నాయకత్వం అంటే ప్రసంగాలు చేయటం...ఎన్నికల్లో గెలవటమే కాదు అంటూ ఆర్ఆర్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ఇప్పటి వరకు బీజేపీ రాష్ట్రం ఏదైనా వరసగా ఎన్నికల్లో గెలుపు సాధించటమే తమ విజయంగా చెప్పుకుంటూ వస్తోంది. నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్ తో జూన్ 20 న ఢిల్లీ లోని జంతరమంతర్ దగ్గర కాక్రోజ్ జనతా పార్టీ (సిజెపి) నిర్వహించిన ఒక్క ఆందోళన ఇప్పుడు దేశ రాజకీయాల్లో పెద్ద కలకలానికి కారణం అయింది. అంతే కాదు..అప్పటి వరకు దేశంలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఉన్న బీజేపీ బిక్కుబిక్కు మనే పరిస్థితి వచ్చింది. ఈ తరుణంలో ముంబై లో గురువారం నాడు ఆర్ఆర్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ జెన్ జీ, జెన్ ఆల్ఫా బృందాలతో నిర్వహించిన సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ప్రధాని నరేంద్ర మోడీ ని టార్గెట్ చేసుకుని చేసినట్లు కనిపిస్తోంది అనే అభిప్రాయం పెద్ద ఎత్తున వ్యక్తం అవుతోంది. యువత విషయంలో బీజేపీ చెప్పిన దానికి పూర్తి బిన్నంగా మోహన్ భగవత్ వ్యాఖ్యలు ఉన్నాయి.

గత పన్నెండు సంవత్సరాలుగా మాటలతో మాయ చేస్తూ రాజకీయం చేస్తున్నది మోడీ అండ్ అమిత్ షా టీం అన్న సంగతి దేశ ప్రజలందరికి తెలుసు. దీనికి సంబంధించిన వీడియో లు కూడా గత కొంత కాలంగా సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్నాయి. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో రూపాయి పతనంపై మోడీ మాట్లాడిన మాటలు...మాంసం ఎగుమతులపై చేసిన వ్యాఖ్యలు...అవినీతిని సహించేది లేదు అంటూ తీవ్ర ఆరోపణలు ఉన్న వాళ్ళను పార్టీలో చేర్చుకోవటం...నల్లధనం నిర్మూలన ..ఉపాధి అవకాశాలు పెంపు వంటి ఎన్నో అంశాల్లో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలం అయింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా కు అంతే ఉండదు. ఒక వైపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సాగుతుంటే పార్లమెంట్ వేదికగా దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై సభ సాక్షిగా ప్రకటన చేయాల్సిన ప్రధాని సభకు రాకుండా..రీల్స్ తోనూ...ఎన్డీయే ఎంపీల సమావేశాల్లోనూ మాట్లాడుతున్నారు. చివరకు రాజ్య సభ చైర్మన్ సి పీ రాధాకృష్ణన్ కూడా సభకు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వచ్చి ప్రకటన చేయాలనే విపక్షాల డిమాండ్ ను ఆయన దృష్టికి తీసుకువెళ్లాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు కు సూచించారు.

దేశంలో తమ కంటే శక్తివంతమైన నేతలు, పార్టీ లేదు అని చెప్పుకుంటున్న వాళ్లకు ఇంత కంటే అవమానం ఏమి ఉంటుంది అనే చర్చ కూడా ఇప్పుడు సాగుతోంది. తాజాగా మోహన్ భగవత్ ముంబై వేదికగా చేసిన వ్యాఖ్యలు రాబోయో రోజుల్లో చోటుచేసుకోబోయే పరిణామాలకు సంకేతాలా...లేక యువత లో ఉన్న ఆగ్రహాన్ని చల్లార్చేందుకు వేసిన ఎత్తుగడా అన్న అనుమానాలు కూడా లేకపోలేదు. గత ఎన్నికల్లోనే బీజేపీ బొటాబొటి గా బయటపడింది. 2024 ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 240 సీట్లకు పరిమితం అయిన విషయం తెలిసిందే. యువత లో నెలకొన్న వ్యతిరేకత ఇదే రీతిలో కొనసాగితే వచ్చే ఎన్నికల్లో బీజేపీ వంద నుంచి 150 సీట్లకు పరిమితం అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం చూస్తే యువత బీజేపీ విషయంలో ముఖ్యంగా మోడీ, అమిత్ షా ల విషయంలో తమ అభిప్రాయాలను మార్చుకునే ఛాన్స్ చాలా చాలా తక్కువ అనే అంచనాలు ఉన్నాయి.

గత మూడు ఎన్నికల్లో హిందుత్వ ఓట్ల కన్సాలిడేషన్ బీజేపీ కి బాగా కలిసి వచ్చినా కూడా అయోధ్య రామమందిరం లో చోటు చేసుకున్న విరాళాల చోరీ విషయం బీజేపీ కి రానున్న రోజుల్లో బాగా డ్యామేజ్ చేసే అవకాశం ఉంది అని చెపుతున్నారు. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే ఇంతటి కీలక అంశంలో అటు ప్రధాని మోడీ కానీ..ఇటు అమిత్ షా కానీ అధికారికంగా ఎక్కడా ఈ అంశంపై స్పందించలేదు. అన్ని రకాలుగా అడుగంటుతున్న కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టను గాడిన పెట్టేందుకు ఆర్ఆర్ఎస్ ఏమైనా రాబోయే రోజుల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటుందా లేదా అన్నది వేచిచూడాల్సిందే. ఈ కీలక విషయంలో ప్రధాని మోడీ, అమిత్ షా ల ప్రకటన కోరుతూ విపక్షాలు అన్నీ పార్లమెంట్ సభా కార్యక్రమాలను అడ్డుకుంటూ విషయాన్ని లైవ్ లో ఉంచుతున్నాయి.

Next Story
Share it