కారుకు దారివ్వలేదని గన్ తీసి కాల్చాడు

అది ఓ చిన్న గల్లీ. ఆ గల్లీలో ఖరీదైన కారు ఎంట్రీ ఇచ్చింది. అదే మార్గంలో ఓ వ్యక్తి బండిపై పోతున్నాడు. కానీ ఎంతసేపటికి ఆ ల్యాండ్ రోవర్ కారులో ఉన్న వ్యక్తికి దారి దొరకటంలేదు. తనకూ ఎంతకూ దారి ఇవ్వకపోవటంతో బైక్ పై ఉన్న వ్యక్తితో కారు లో ఉన్న వ్యక్తి వాదనకు దిగాడు. అంతే కాదు తన వద్ద ఉన్న లైసెన్స్ డ్ గన్ తీసి కాల్పులు జరిపాడు. అయితే లక్కీగా ఆ కాల్పుల నుంచి తప్పించుకున్న వ్యక్తి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన బెంగుళూరులోని ఎం ఎస్ రామయ్య మెడికల్ కాలేజీ దగ్గరిలో జరిగింది. ఈ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కారు నడిపిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆయన పేరు రావిష్ గౌడగా పోలీసులు వెల్లడించారు.
ఫిర్యాదుదారు అనిల్ బుల్లెట్ల నుంచి తప్పించుకుని యశ్వంత్ పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సహనం కోల్పోయిన కారులోని వ్యక్తి గన్ తీసి కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. అంతకు ముందు ఇద్దరి మధ్యా మాటామాట పెరిగిందన్నారు. ట్రాఫిక్ రద్దీ కారణంగా సహనం కోల్పోతున్న వాహనదారులు దాడులకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ముందు దారి లేకపోయినా వెనక ఉన్న వాహనంలోని వారు పదే పదే హారన్లు కొడుతూ చికాకు పెట్టిస్తున్నారని..ఇదే గొడవలకు కారణం అవుతుందని తెలిపారు.