Telugu Gateway
Top Stories

బంకీపుర్ లో ప్రశాంత్ కిషోర్ విజయబావుటా

బంకీపుర్ లో ప్రశాంత్ కిషోర్ విజయబావుటా
X

జెన్ జీ ఉద్యమాలతో ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతున్న కేంద్రంలోని అధికార బీజేపీ కి ఇప్పుడు మరో భారీ షాక్ తగిలింది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో ఢిల్లీ వేదికగా కాక్రోజ్ జనతా పార్టీ (సిజెపీ) చేపట్టిన నిరసనలతో ఏకంగా కేంద్ర విద్య శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. యువతపై జరిగిన లాఠీచార్జి అంశంపై పార్లమెంట్ వేదికగా ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా లు క్షమాపణలు చెప్పాలని విపక్షాలు గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నాయి. ఇదే అంశంపై నిరసనలు కూడా సాగిస్తున్నాయి. ఈ తరుణంలో బీహార్ లో జరిగిన బంకీపూర్ ఉప ఎన్నిక ఫలితం బీజేపీ ని షాక్ కు గురి చేసింది. ఇక్కడ అత్యంత కీలక విషయం ఏమిటి అంటే ఇది బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఖాళీ చేసిన నియోజకవర్గం కావటం. గత ముప్పై ఏళ్లుగా బీజేపీకి కంచుకోటగా పేరున్న ఈ స్థానంలో జనసురాజ్ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ గెలుపొందడం ఇప్పుడు దేశ రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారింది అనే చెప్పాలి. వరస సంఘటనలు అన్నీ చూస్తే దేశంలో బీజేపీ కి ప్రమాద ఘంటికలు మోగుతున్నట్లు కనిపిస్తోంది అనే చర్చ సాగుతోంది.

బీహార్ లో ఇప్పుడు బీజేపీ నే అధికారంలో ఉంది. అది కూడా పార్టీ కి ఎంతో పట్టు ఉన్న సీట్ ను ఉప ఎన్నికలో కోల్పోవటం అంటే ఆషామాషీ వ్యవహారం ఏమి కాదు. గత బీహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పార్టీ పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపాయింది. కానీ అయన మాత్రం పోటీ చేయలేదు . ఇప్పుడు ఉప ఎన్నిక బరిలో నిలిచి తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. సోమవారం ఉదయం కౌంటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రశాంత్ కిశోరే లీడ్ లో కొనసాగారు. ఫైనల్ గా బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ పై ప్రశాంత్ కిషోర్ 18964 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇతర రాష్ట్రాల్లోని ఉప ఎన్నికల ఫలితాలతో పోలిస్తే బీజేపీ జాతీయ అధ్యక్షుడు పోటీ చేసి గెలిచినా సీటు కావటం...30 ఏళ్లలో ఎప్పుడూ ఇక్కడ ఓటమి చవిచూడని బీజేపీ పరాజయం పాలు కావటంతో దీనికి రాజకీయంతో ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది.

.

Next Story
Share it