అయోధ్యలో కీలక ఘట్టం పూర్తి (Ayodya Ram Mandir)
ఆ పాత్రల్లోని అంకిత భావాన్ని, సందేశాన్ని అందిపుచ్చుకుని జాతి నిర్మాణంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. శబరి, నిషాద రాజు గుహుడు, ఒక ఉడుత, జటాయువు పాత్రలను ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తావించారు. రామభక్తురాలైన శబరి మాతకు రామాయణంలో ఒక ప్రత్యేకత ఉంది. ఆమె ఏళ్ల తరబడి రాముని రాకకోసం నిరీక్షించి తన కలను సాకారం చేసుకున్న గిరిజన మహిళా శిరోమణి. అరణ్యవాసంలో రాముడు శబరి ఆతిథ్యం తీసుకుని ప్రేమతో అందించిన పళ్లను స్వీకరించి ఆమె జన్మను చరితార్ధం చేశాడు. శబరి మాత రామునిపై ఉంచిన విశ్వాసం గొప్పదని, రాముడు వస్తాడనే ఆమెకున్న నమ్మకమే పునాదిగా ఉజ్వల భారతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. రాముడు, సీత, లక్ష్మణులను గంగానది దాటించి వారిపట్ల స్నేహశీలతను చాటుకున్న గిరిజన నేత గుహుడు. వారి మైత్రీ బంధం రామాయణంలో పలు చోట్ల కనిపిస్తుంది. రాముడు 14 ఏళ్ల వనవాసం తర్వాత కూడా తన మిత్రుడిని మరిచిపోకుండా కలుసుకుంటాడు. రాముడు-గుహుడి మధ్య మైత్రీబంధాన్ని ప్రధానమంత్రి మోదీ ప్రస్తావిస్తూ, దేశ నిర్మాణంలో ప్రజలంతా ఇలాంటి మైత్రీబంధాన్ని కలిగి ఉండాలని, రామాయణంలోని గుహుడి పాత్ర ఇందుకు ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. లంక చేరడానికి వారధి నిర్మించే సమయంలో అల్పప్రాణి అయిన ఉడుత సాయం చేసిన కథ కూడా రామాయణ ప్రాత్రల్లో ప్రచారంలో ఉంది. వారధి కోసం హనుమంతుడు, ఇతర వానరులు పెద్ద పెద్ద బండరాళ్లు సముద్రంలో పడవేస్తుండగా, ఉడుత సైతం వారితో పాలుపంచుకుని చిన్నచిన్న గులకరాళ్లు తెచ్చి సముద్రంలో జారవిడచేది. ఉడుత సాయం రాముని ప్రశంసలు సైతం అందుకుంది. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ప్రస్తావిస్తూ, నేను సాధారణ వ్యక్తిననుకునే వాళ్లు ఉడుత సాయాన్ని గుర్తుంచుకోవాలని, సాయం చిన్నదైనా, పెద్దదైనా జాతి నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు.