భారత్ వెళ్లొద్దు..అమెరికా హెచ్చరిక
దేశంలో అనూహ్యంగా పెరుగుతున్న కరోనా కేసులతో పలు దేశాలు ఆంక్షల కొరడా ఝుళిపిస్తున్నాయి. ఇప్పటికే న్యూజిల్యాండ్, హాంకాంగ్ లు భారత్ నుంచి వచ్చే విమానాలను అనుమతించబోమని ప్రకటించాయి. యునైటెడ్ కింగ్ డమ్ (యూకె) కూడా ఇప్పటికే భారత్ ను రెడ్ లిస్ట్ లో చేర్చింది. పలు దేశాలు తాత్కాలికంగా ఈ నిషేధాన్ని అమల్లోకి తెచ్చాయి. దీనికి కారణం దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి విస్తృతంగా ఉండమే. ఇప్పుడు అమెరికా తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. భారత్ కు ప్రయాణాలు చేయవద్దని సూచించింది. పూర్తిగా వ్యాక్సిన్ తీసుకున్న పౌరులకు సైతం అమెరికాకు చెందిన డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) విభాగం పలు సూచనలు చేసింది.
వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా కరోనా సోకి కొత్త రకం వేరియంట్లకు కారణం అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. భారత్ కు ప్రయాణం తప్పనిసరి అయితే పూర్తి స్థాయి వ్యాక్సినేషన్ తోనే వెళ్లాలని సూచించింది. అదే సమయంలో మాస్క్ ధరించటం తప్పనిసరి అని..ఆరు అడుగుల దూరం మెయింటెన్ చేయాలని సూచించింది. పూర్తి స్థాయి వ్యాక్సిన్ తీసుకున్న వారు దేశం నుంచి బయటకు వెళ్లే సమయంలో ఎలాంటి టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదన్నారు. వెళ్లే దేశంలో ఈ నిబంధన ఉంటే మాత్రం ఈ నిబంధన పాటించాల్సి ఉంటుందని సూచించారు.