Telugu Gateway
Top Stories

ఆధార్ పై ఇప్పుడు జాగ్ర‌త్త‌లేంటి?!

ఆధార్ పై ఇప్పుడు జాగ్ర‌త్త‌లేంటి?!
X

దేశ వ్యాప్తంగా ఆధార్ భ‌ద్ర‌త‌పై ఎప్ప‌టి నుంచో అనుమానాలు ఉన్నాయి. దీనిపై నిపుణుల సైతం ప‌లు సందేహాలు వ్య‌క్తం చేశారు. అయినా స‌రే కేంద్రం ఇప్ప‌టివ‌ర‌కూ ఆధార్ డేటా ఎక్క‌డా దుర్వినియోగం అయ్యే అవ‌కాశం లేదంటూ చెప్పుకొచ్చింది. ఇప్పుడు మాత్రం చాలా తాపీగా ఆధార్ వాడ‌కందార్ల‌కు ప‌లు జాగ్ర‌త్త‌లు చెబుతోంది. ఇది చూసిన వారంతా అంతా అయిపోయిన త‌ర్వాత ఇప్పుడు జాగ్ర‌త్త‌లు ఏమిటి అంటూ నిట్టూరుస్తున్నారు.ఎవ‌రికి ప‌డితే వారికి ఆధార్ జిరాక్స్ కాపీల ఇవ్వొద్ద‌ని కేంద్ర ఐటి శాఖ తాజాగా ప‌లు మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. ఇప్పుడు దేశంలో ప్రతీ పనికి ఆధార్‌ను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. సిమ్‌ కార్డు నుంచి బ్యాంక్‌ ఖాతాల వరకు ఆధార్‌ తప్పనిసరి అయిపోయింది. ఆధార్‌ కార్డు లేనిదే కొన్ని పనులు జరగవు. ప్రతీ విషయంలోనూ ఆధార్‌ను వాడుతున్న నేపథ్యంలో.. ఏ విష‌యంలోనైనా ఆధార్ కార్డును ఇత‌రుల‌కు ఇవ్వాల్సి వస్తే.. కేవ‌లం 'మాస్క్‌డ్ కాపీ'ల‌ను మాత్ర‌మే ఇవ్వాల‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది.

ఆధార్ కార్డును దుర్వినియోగం చేయకుండా ఉండేందుకే ఇలా చేయాలని కేంద్రం కోరింది. ముందు జాగ్ర‌త్త‌ కోస‌మే ఇలా సూచ‌న చేస్తున్న‌ట్లు కేంద్రం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. అయితే ఇప్ప‌టికే కోట్లాది మంది ఆధార్ వివ‌రాల బ‌య‌ట‌కి పోయాయని చెబుతున్నారు. కొత్త‌గా ప్ర‌జ‌ల‌ను అల‌ర్ట్ చేస్తూ ఎవరికైనా ఫొటోకాపీకి బదులుగా మాస్క్‌డ్‌ కాపీలను మాత్రమే చూపించాలని స్ప‌ష్టం చేసింది. మాస్క్‌డ్‌ ఆధార్‌ కాపీ అంటే ఏమిటో కూడా తెలుసుకోండి. భారత పౌరుల సౌకర్యార్థం యుఐడిఏఐ(UIDAI) ఆన్‌లైన్‌లో మరో ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీనినే మాస్క్‌ ఆధార్‌ కార్డ్‌ అని చెబుతున్నారు. ఈ కార్డుపై 12 అంకెల ఆధార్‌ నంబర్‌ పూర్తిగా కనిపించదు. చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపిస్తాయి. ఆధార్‌లో మొదటి ఎనిమిది అంకెలు ****-**** గా కనిపిస్తాయి. మాస్క్‌డ్‌ ఆధార్‌ కార్డు.. ఒరిజినల్‌ కార్డును సురక్షితంగా ఉంచుతుంది. ఆధార్ సైట్ లోకి వెళ్ళాక మొబైల్ తో అనుసంధానం అయి ఉన్న వారికి మాత్ర‌మే దీన్ని డౌన్ లోడ్ చేసుకునే సౌక‌ర్యం అందుబాటులో ఉంటుంది.

Next Story
Share it