Telugu Gateway
Top Stories

పార్లమెంటరీ ప్యానెల్ నివేదికలో సంచలన విషయాలు

పార్లమెంటరీ ప్యానెల్ నివేదికలో సంచలన విషయాలు
X

దేశీయ విమానయాన రంగంలో భద్రత గాలిలో దీపమేనా?. విమానం ఎక్కిన వాళ్ళు అదృష్టం ఉంటే కిందకు దిగుతారు..లేదు అంటే అంతేనా అన్న అనుమానాలు వచ్చేలా ఉన్నాయి ఈ నివేదికలోని అంశాలు. దీనికి ప్రధాన కారణం దేశంలోని 50 శాతం విమానాల్లో సాంకేతిక లోపాలు ఉన్నట్లు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ సివిల్ ఏవియేషన్ వెల్లడించింది. ఇందులోని వివరాలు విమాన ప్రయాణికులను ఖచ్చితంగా భయపెట్టేలా ఉన్నాయని..దేశీయ విమానయాన రంగంలో భద్రతకు సంబంధించి వెంటనే ప్రత్యేక దృష్టి సారించాలని ప్యానెల్ సూచించింది. విమానయాన రంగంలో సంస్కరణల ఆవశ్యకతను నొక్కిచెబుతూ, వ్యవస్థాగత లోపాలను పరిష్కరించి, ప్రయాణీకుల భద్రతను నిర్ధారించడానికి పటిష్టమైన చర్యలు, మెరుగైన పర్యవేక్షణ యంత్రాంగాలు, మెరుగైన సంస్థాగత సామర్థ్యం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అని పేర్కొంది.

దేశీయ విమానయాన రంగంలో ప్రధాన వాటా ఇండిగో ఎయిర్ లైన్స్ తో పాటు ఎయిర్ ఇండియా లదే అన్న విషయం తెలిసిందే. ఏడాది కాలంగా నిర్వహించిన ఆడిట్ నివేదికలోని అంశాల ప్రకారం ఇండిగో ఎయిర్ లైన్స్ ఫ్లైట్స్ లో ఎక్కువ సాంకేతిక సమస్యలు గుర్తించారు. ఆ తర్వాత స్థానంలో ఎయిర్ ఇండియా విమానాలు ఉన్నాయి. 2025 జనవరి నుంచి 2026 ఫిబ్రవరి వరకు మొత్తం 754 విమానాల్లో ఆడిట్ నిర్వహించగా అందులో 377 విమానాల్లో లోపాలు ఉన్నట్లు గుర్తించారు. ఆడిట్ చేసిన వాటిలో నంబర్ వన్ ప్లేస్ లో ఉన్న ఇండిగో విమానాల సంఖ్య ఎక్కువ...లోపాలు కూడా ఇందులోనే ఎక్కువ ఉన్నట్లు పార్లమెంటరీ ప్యానెల్ వెల్లడించింది. మొత్తం 405 ఇండిగో విమానాల్లో ఆడిట్ నిర్వహించగా..అందులో 148 విమానాల్లో లోపాలు ఉన్నట్లు తేలింది. కొన్ని లోపాలు పదే పదే పునరావృతం అయ్యాయి అని కూడా గుర్తించారు. ఎయిర్ ఇండియా కు చెందిన 166 విమానాలు, ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ కు చెందిన 101 విమానాల్లో ఆడిట్ నిర్వహించగా వీటిలో కూడా లోపాలు బయటపడ్డాయి. మొత్తం మీద అన్ని కలుపుకుని దగ్గర దగ్గర 50 విమానాల్లో లోపాలు బయటపడటం కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇవి ప్రయాణికుల భద్రత...సంస్థల విశ్వసనీయతపై ప్రభావం చుపిస్తాయని అభిప్రాయపడింది.

ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే దేశీయ విమానయాన రంగాన్ని నియంత్రించాల్సిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసిఏ)లో 48 . 3 శాతం మేర ఖాళీలు ఉండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశీయ విమానయాన రంగాన్ని ఇంత తక్కువ మంది సిబ్బందితో డీజీసిఏ ఎలా పర్యవేక్షించగలదు అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఒక వైపు ప్రధాని నరేంద్ర మోడీ ..కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడులు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున విమానాశ్రయాలు..మౌలిక వసతులు అభివృద్ధి చేస్తున్నామని చెపుతున్న విషయం తెలిసిందే. కానీ పార్లమెంటరీ ప్యానెల్ నివేదికలోని అంశాలు చూసిన తర్వాత దేశీయ విమానయాన రంగం డొల్లతనం అర్ధం అవుతుంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 2025 సంవత్సరం లో భద్రతా ఉల్లంఘనలకు సంబంధించి డీజీసీఏ వివిధ ఎయిర్ లైన్స్ కు 19 నోటీసులను జారీ చేసింది.

అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమాన ఘోర ప్రమాదం తర్వాత డీజీసీఏ ఎయిర్ ఇండియా విమానాల్లో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించిన విషయాన్ని కూడా ఇందులో ప్రస్తావించారు. ఆ సమయంలో నిర్వహించిన ఆడిట్ లో ఏకంగా వంద లోపాలను గుర్తించారు. అందులో ఏడు లోపాలు మాత్రం తీవ్ర ముప్పు ఉన్నవిగా పేర్కొన్నారు. ఈ నివేదిక తర్వాత అయినా కేంద్ర పౌర విమానయాన శాఖ దిద్దుబాటు చర్యలు చేపడుతుందా లేక ఎప్పటిలాగానే చూసీ చూడనట్లు వదిలేస్తుందా అన్నది వేచిచూడాల్సిందే. పైలట్స్ సంబంధించిన శిక్షణ..సరిపడినంత మంది క్యాబిన్ సిబ్బంది లేకపోవటం వంటి అంశాలను కూడా ఇందులో ప్రస్తావించారు.

Next Story
Share it