Telugu Gateway
Top Stories

ఆ స్విమ్మింగ్ పూల్ ఎంట్రీ టిక్కెట్ 3450 రూపాయ‌లు

ఆ స్విమ్మింగ్ పూల్ ఎంట్రీ టిక్కెట్ 3450 రూపాయ‌లు
X

దుబాయ్. ఎన్నో ప్ర‌త్యేక‌త‌ల నిల‌యం. ప్ర‌పంచంలోనే నెంబ‌ర్ వ‌న్ ప్ర‌దేశాలు ఎన్నో ఉన్నాయి అక్క‌డ‌. ప్ర‌పంచంలోనే ఎత్తైన భ‌వ‌నంతోపాటు ప‌లు ప్ర‌త్యేక పర్యాట‌క ఆక‌ర్ష‌ణ‌లు ఈ దేశం ప్ర‌త్యేక‌త‌. ఇప్పుడు ఆ జాబితాలో ఓ కొత్త ఆక‌ర్ష‌ణ వ‌చ్చి చేరింది. అదే పామ్ ట‌వ‌ర్ లోని 50వ అంత‌స్థులో ఉన్న ఔరా స్కైపూల్. ప్ర‌పంచంలోనే ఎత్తైన 360 డిగ్రీ ఇన్ఫినిటి పూల్ ఇది. తాజాగా ఇది సంద‌ర్శ‌కుల‌కు అందుబాటులోకి వ‌చ్చింది . అయితే ఇందులోకి ప్ర‌వేశించ‌టం ఒకింత ఖ‌రీదైన వ్య‌వ‌హార‌మే. దీనికి ఎంట్రీ ఫీజు కూడా ఉంది. భార‌తీయ క‌రెన్సీలో అయితే ప్రారంభ టిక్కెట్ ధ‌ర 3450 రూపాయ‌లు (170 ఏఈడీ) అయితే...ఒక రోజంతా అక్క‌డ గ‌డిపేందుకు వీలుగా వీఐపి టిక్కెట్ ఫీజు అయితే 12,190 రూపాయ‌లు (600 ఏఈడీ) చెల్లించాల్సి ఉంటుంది.

అయితే ఇక్క‌డ నుంచి దుబాయ్ లోని టాప్ ఎట్రాక్షన్స్ ను ప‌ర్యాట‌కులు చూడొచ్చు. ఈ ఔరా స్విమ్మింగ్ పూల్ 200 మీట‌ర్ల ఎత్తులో ఉంటుంది. సంస్థ అధికారిక వెబ్ సైట్ లో ఈ విష‌యాలు అన్నీ పొందుప‌ర్చారు. ఈ ప్రాంతాన్ని సంద‌ర్శించే వాళ్లకు న‌గ‌రం త‌మ కాళ్ళ కింద ఉంద‌నే అనుభూతి క‌లుగుతుంద‌ని నిర్వాహ‌కులు తెలిపారు. ఇక్క‌డే బార్ తోపాటు అంత‌ర్జాతీయ వంట‌కాలు కూడా అందుబాటులో ఉంటాయి. 360 డిగ్రీ వ్యూ ద్వారా ఇక్క‌డ నుంచి మాన‌వ నిర్మిత అద్భుత క‌ట్ట‌డం అయిన పామ్ జుమేరా, బుర్జ్ అల్ అర‌బ్, బుర్జ్ ఖ‌లీఫా, ఎయిన్ దుబాయ్ ల‌ను చూడొచ్చు. ఈ ఔరా స్విమ్మింగ్ ప్ర‌తి రోజు ఉద‌యం ప‌ది గంట‌ల నుంచి సూర్యాస్త‌మ‌యం వ‌ర‌కూ తెరిచి ఉంటుంది. ప‌ర్యాట‌కులు త‌మ వెసులుబాటును బ‌ట్టి సంద‌ర్శ‌న స‌మ‌యాన్ని ఎంచుకోవ‌చ్చు.

Next Story
Share it