Telugu Gateway
Top Stories

వారంలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కు అనుమతి!

వారంలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కు అనుమతి!
X

గుడ్ న్యూస్. భారత్ లోనూ కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అది కూడా వారం రోజుల్లోనే వచ్చే అవకాశం ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కొత్త సంవత్సరానికి వ్యాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్ వస్తుందని చెబుతున్నారు. ప్రముఖ ఫార్మా సంస్థ ఆస్ట్రాజెనెకా, ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ కే తొలి అనుమతి భారత్ లో రావొచ్చని చెబుతున్నారు. భారత్ లో ఈ వ్యాక్సిన్ ను సీరమ్ ఇన్ స్టిట్యూట్ తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాదు కోవిషీల్డ్ వ్యాక్సిన్ మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ భారత్ లో జరిగాయి. ఇది కూడా ఓ సానుకూల పరిణామంగా ఉంది. తొలి రెండు దశల డేటాతోపాటు మూడవ దశ డేటాను పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నా నియంత్రణా సంస్థలు మరింత సమాచారం కోరి నిర్ణయాన్ని వాయిదా వేశాయి.

ఈ వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. తాజాగా మరింత క్లినికల్‌ డేటాను సీరమ్ అందించినట్లు తెలుస్తోంది. భారత్ లో వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి కోసం ఫైజర్‌, భారత్‌ బయోటెక్ తదితర కంపెనీలు సైతం అనుమతులు కోరాయి. కోవిషీల్డ్ వ్యాక్సిన్ కు అనుమతి వస్తే వెంటనే వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించేలా ఇఫ్పటికే సీరమ్ దేశంలో 5 కోట్ల డోసులను సిద్ధంగా ఉంచింది. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌పై యూకే, బ్రెజిల్‌ తదితర పలు దేశాలలో మూడో దశ క్లినికల్‌ పరీక్షలు జరుగుతున్నాయి. రెండు పూర్తి డోసేజీల వల్ల 62 శాతం ఫలితాలు వెలువడగా.. ఒకటిన్నర డోసేజీలతో 90 శాతం మెరుగైన ఫలితాలు లభించినట్లు ఇటీవల కంపెనీ వెల్లడించింది.

Next Story
Share it