Telugu Gateway
Top Stories

ఆ అపార్ట్ మెంట్ ఖరీదు అక్షరాలా 430 కోట్లు

ఆ అపార్ట్ మెంట్ ఖరీదు అక్షరాలా 430 కోట్లు
X

అపార్ట్ మెంట్ ధర ఐదు నుంచి పది కోట్ల రూపాయలు అంటేనే 'ఔరా' అనుకుంటాం. కానీ ఈ అపార్ట్ మెంట్ ధర ఏకంగా 430 కోట్ల రూపాయలు అంటే అవాక్కు అవ్వాల్సిందే. అంతే కాదు ఆసియాలో ఇప్పటివరకూ అమ్ముడు అయిన అత్యంత ఖరీదైన అపార్ట్ మెంట్ కూడా ఇదే కావటం విశేషం. ఇంతకీ ఇది ఎక్కడ అన్నదే కదా ఉత్కంఠ. హాంకాంగ్ లో. ఓ అపార్ట్ మెంట్ ఏకంగా భారతీయ కరెన్సీలో 430 కోట్ల రూపాయలకు అమ్ముడుపోవటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇది ఉన్నది మళ్ళీ 3378 చదరపు అడుగుల్లో మాత్రమే. ఈ లెక్కన ఒక్కో చదరపు అడుగు హాంకాంగ్ డాలర్లలో 1,36,000గా ఉంది. ఐదు బెడ్ రూమ్స్ తో కూడిన అపార్ట్ మెంట్ కు ప్రైవేట్ రూఫ్ , స్విమ్మింగ్ పూల్, మూడు పార్కింగ్ స్పేస్ లు ఇచ్చారు.

హాంకాంగ్ లోని రియల్ ఎస్టేట్ టైకూన్ విక్టర్ లీ అసెట్ హోల్డింగ్స్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును విక్రయించింది. అయితే దీన్ని ఎవరు కొనుగోలు చేశారు అనే విషయాన్ని మాత్రం ఆ సంస్థ బహిర్గతం చేయలేదు. అయితే ఇంత ధర పెట్టి ఐదు బెడ్ రూమ్ ల అపార్ట్ మెంట్ కొనుగోలు చేశారు అంటే అంతర్జాతీయంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ రికవరి అవుతుందనే సంకేతాలు వస్తున్నట్లే అని నిపుణులు భావిస్తున్నారు. బ్లూమ్ బర్గ్ ఈ ఆసక్తికర స్టోరీని ప్రచురించింది. అయితే 2020 సంవత్సరంలో విలాసవంతమైన నివాస సముదాయాల ధరలు ఎనిమిది శాతం మేర తగ్గుముఖం పట్టినట్లు తేల్చారు.

Next Story
Share it