Telugu Gateway
Top Stories

ఏషియానా ఎయిర్ లైన్స్ షాకింగ్ డెసిషన్

ఏషియానా ఎయిర్ లైన్స్ షాకింగ్ డెసిషన్
X

ఒక్క దెబ్బకు ఆ ఎయిర్ లైన్స్ ఎమర్జెన్సీ డోర్స్ దగ్గర ఉండే సీట్ల టికెట్స్ అమ్మటం ఆపేసింది. ఫ్లైట్ అంతా ఫుల్ అయినా సరే ఆ టికెట్స్ మాత్రం అమ్మబోమని ప్రకటించింది. దక్షిణ కొరియాకు చెందిన ఏషియానా ఎయిర్ లైన్స్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల భద్రత కోసమే తాము ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని ప్రకటించింది.. కొద్ది రోజుల క్రితమే ఈ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలోనే భయంకరమైన సంఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కొద్ది నిమిషాల్లో విమానం ల్యాండ్ కావాల్సి ఉండగా ఆ సమయంలో ఒక ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్‌ తెరచి అందరినీ భయాందోళనకు గురి చేశాడు. పెద్ద ఎత్తున గాలి లోపలి రావటంతో ఆ విమానంలో ఉన్న ప్రయాణికులు అందరూ వణికిపోయారు ఆ దెబ్బకు. దక్షిణ కొరియా లోని జెజు ద్వీపం నుంచి డేగూ కు బయలు దేరిన విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ ఫ్లైట్ భూమికి 700 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేశాడు. ఆ సమయంలో విమానంలో 194 మంది ప్రయాణికులు సహా సిబ్బందితో కలిసి మొత్తం 200 మంది ఉన్నారు.ఈ ఘటనలో కొంతమందికి స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. ఈ పని చేసిన ప్రయాణికుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తొందరగా విమానం దిగాలనే ఒత్తిడితో ఈ పని చేసినట్లు ఆ ప్రయాణికుడు వెల్లడించాడు. ఈ దెబ్బకు ఎయిర్ లైన్స్ ఎమర్జెన్సీ డోర్స్ పక్కన ఉండే సీట్లు అమ్మటం ఆపేసింది. ఇది ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. గతంలోనూ పలు ఎయిర్ లైన్స్ లో ఇలా ఎమర్జెన్సీ డోర్స్ ఓపెన్ చేసే ప్రయత్నాలు జరిగాయి. కానీ ఎప్పుడు ఇలా డోర్ ఓపెన్ అయిన దాఖలాలు తక్కువే అని చెప్పొచ్చు.

Next Story
Share it