Telugu Gateway
Top Stories

ఆర్య‌న్ ఖాన్ కు బెయిల్

ఆర్య‌న్ ఖాన్ కు బెయిల్
X

సంచ‌ల‌నం రేపిన క్రూయిజ్ డ్ర‌గ్స్ కేసులో షారుక్ ఖాన్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్ కు బెయిల్ ద‌క్కింది. ముంబ‌య్ హైకోర్టు ఈ మేర‌కు ఆదేశాలు జారీ చేసింది. దిగువ కోర్టులో ప‌లుమార్లు బెయిల్ పిటీష‌న్లు దాఖ‌లు చేసినా కూడా అనుమ‌తి ల‌భించ‌లేదు. చివ‌ర‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో షారుఖ్ ఖాన్ ఫ్యామిలీకి ఊర‌ట ల‌భించిన‌ట్లు అయింది. ఆర్యన్‌ తరపు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ, ఎన్‌సీబీ తరపు న్యాయవాదుల వాదనలను విన్న హైకోర్టు ఆర్యన్‌తో పాటు మోడల్‌ మున్‌మున్‌ ధమేచ, ఆర్భాజ్‌ మర్చంట్‌కు కూడా బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. దీంతో ఆర్యన్‌ రేపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. దాదాపు 23 రోజుల అనంతరం ఆర్యన్‌కు బెయిల్‌ రావడంతో కుటుంబ సభ్యులతో పాటు షారుఖ్ ఫ్యాన్స్‌ ఊపిరి పీల్చుకున్నారు.ఈ నెల అక్టోబర్‌ 2వ తేదీ అర్థరాత్రి క్రూయిజ్‌ ఓడరేవు డ్రగ్స్‌ పార్టీలో పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ తనిఖీల్లో ఆర్యన్‌తో పాటు మరో 8మందిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

అప్పటి నుంచి ఆర్యన్‌ దాదాపు 23 రోజుల పాటు జైలులోనే ఉన్నాడు. ఆర్యన్‌ బెయిల్‌ పటిషన్‌పై మూడు రోజుల విచారణ అనంతరం హైకోర్టు నేడు(గురువారం) ఆర్యన్‌తో పాటు మరో ఇద్దరికి బెయిల్‌ ఇచ్చింది. క్రూయిజ్ లో ఉన్న ఆర్య‌న్ ఖాన్ ద‌గ్గ‌ర డ్ర‌గ్స్ లేవ‌ని..అత‌ను డ్ర‌గ్స్ వాడిన‌ట్లు ఎలాంటి ఆధారాలు లేవ‌ని ఆయ‌న తర‌పు లాయ‌ర్ ముకుల్ రోహ‌త్గీ వాద‌న‌లు విన్పించారు. ప‌క్క‌నున్న వ్య‌క్తి ద‌గ్గ‌ర డ్ర‌గ్స్ ఉంటే ఆర్య‌న్ ను ఎలా అరెస్ట్ చేస్తార‌ని..అత‌ని వ‌య‌సును కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని కోర్టును కోరారు. ఎన్ సీపీ త‌ర‌పున ఏఎస్ జి అనిల్ సింగ్ వాద‌న‌లు విన్పిస్తూ ఆర్య‌న్ డ్ర‌గ్స్ వాడ‌టం ఇది తొలిసారి ఏమీకాద‌ని పేర్కొన్నారు. ఆర్య‌న్ డ్ర‌గ్స్ విక్ర‌యించే ప్ర‌య‌త్నం కూడా చేసిన‌ట్లు కోర్టుకు తెలిపారు. ఇరువురి వైపు వాద‌న‌లు విన్న త‌ర్వాత కోర్టు వీరిని జైలులో ఉంచేందుకు స‌రైన ఆధారాల లేవంటూ బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. దీనికి సంబంధించిన తీర్పు ప్ర‌తి శుక్ర‌వారం నాడు బ‌య‌ట‌కు రానుంది. దీంతో అప్పుడు ఆర్య‌న్ తోపాటు మిగిలిన వారు కూడా జైలు నుంచి విడుద‌ల అయ్యే అవ‌కాశం ఉంది. ఈ కేసు వెలుగులోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి వ్య‌వ‌హారం ర‌క‌ర‌కాల మ‌లుపులు తిరుగుతున్న విష‌యం తెలిసిందే.

Next Story
Share it