Telugu Gateway
Top Stories

అర్ణాబ్ గోస్వామికి సుప్రీం బెయిల్ మంజూరు

అర్ణాబ్ గోస్వామికి సుప్రీం బెయిల్ మంజూరు
X

రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్ణాబ్ గోస్వామికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం ఆయన్ను ఓ కేసులో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అర్ణాబ్ పిటీషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయటంతో అర్ణాబ్ తలోజా జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. గత ఎనిమిది రోజులుగా అర్ణాబ్ జైలులో ఉన్నారు. ఇంటీరియర్‌ డిజైనర్‌ ఆత్మహత్య కేసులో అరెస్టయిన రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ ఇన్ చీఫ్‌ అర్ణాబ్‌ గోస్వామి సుప్రీం తలుపు తట్టారు. అక్రమంగా అరెస్టు చేసి తనను వేధిస్తున్నారని, అవసరమనుకుంటే ఈ కేసును సీబీఐతో విచారణ చేయించేందుకు ఆదేశించాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు. ముంబయ్ హైకోర్టు బెయిల్ పిటిషన్‌‌ తిరస్కరణనూ ఆయన సుప్రీం కోర్టులో సవాల్‌ చేశారు.

అర్ణాబ్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే వాదనలు వినిపిస్తూ.. ఇంటీరియర్‌ డిజైనర్‌ ఆత్మహత్య కేసు దర్యాప్తు చట్ట విరుద్ధంగా సాగుతోందని అన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ డీవై చంద్రచూడ్, ఇందిరా బెనర్జీల బెంచ్ స్పందిస్తూ.. 'టీవీ చానెల్స్‌ అరుపులను ప్రభుత్వాలు పట్టించుకుంటే ఎలా? రిపబ్లిక్‌ టీవీలో అతని అరుపులపై మీ ఎన్నికల భవిష్యత్‌ ఆధారపడిందా? మేం ఆ టీవీ చూడం.. కానీ, మహారాష్ట్ర సర్కార్‌ చేసింది సరైనదిగా అనిపించడం లేదు. వ్యక్తులపై రాష్ట్ర ప్రభుత్వాలు కత్తి దూస్తే మేమున్నామని గుర్తుంచుకోండి'అని సుప్రీం బెంచ్‌ కీలక వ్యాఖ్యలు చేసింది. అర్ణాబ్ బెయిల్ పిటీషన్ తిరస్కరించిన ముంబయ్ హైకోర్టుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టులు వ్యక్తుల స్వేచ్చకు సంబంధించి అంశాలపై తమ పరిధిని ఉపయోగించాలని సూచించింది.

Next Story
Share it