Telugu Gateway
Top Stories

విషాదం..హెలికాప్టర్ ప్ర‌మాదంలో 13 మంది మృతి

విషాదం..హెలికాప్టర్ ప్ర‌మాదంలో 13 మంది మృతి
X

ఆర్మీ హెలికాప్ట‌ర్ ప్రమాదం విషాదాంతం అయింది. ఇందులో ప్ర‌యాణిస్తున్న 14 మందిలో 13 మంది మ‌ర‌ణించిన‌ట్లు ప్ర‌ముఖ వార్తా సంస్థ వెల్ల‌డించింది. ఈ హెలికాప్ట‌ర్ లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్‌ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావ‌త్ తోపాటు ఆయ‌న భార్య‌, ఇత‌ర అధికారులు ఉన్న విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చిన వెంట‌నే కేంద్రం అప్ర‌మ‌త్తం అయింది. ప్ర‌దాని న‌రేంద్ర‌మోడీ అత్య‌వ‌స‌ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఏర్పాటు చేశారు. ఆ త‌ర్వాత కేంద్ర ర‌క్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఢిల్లీలోని బిపిన్ రావ‌త్ నివాసానికి వెళ్ళారు. అయితే మృతుల‌ను డీఎన్ఏ ప‌రీక్షల ద్వారా గుర్తించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఎందుకంటే ఈ హెలికాప్ట‌ర్ ప్ర‌మాద తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌టంతో ఎవ‌రు ఎవ‌రో గుర్తించ‌టం క‌ష్టం అని భావిస్తున్నారు. ప్ర‌మాద తీవ్రంగా కార‌ణంగా చాలా మంది మంట‌ల్లో కాలిపోయిన‌ట్లు గుర్తించారు. ఈ ప్ర‌మాదంపై రాజ్ నాధ్ సింగ్ గురువారం నాడు పార్ల‌మెంట్ లో ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. వెల్లింగ‌ట‌న్ మెడిక‌ల్ కాలేజీ లెక్చ‌ర్ ఇవ్వ‌టానికి ఆయ‌న బుధ‌వారం ఉద‌యం తొమ్మిది గంట‌ల‌కు ఢిల్లీ నుంచి బయ‌లుదేరారు. ప్ర‌త్యేక విమానంలో వీరు సూలూరు ఎయిర్ ఫోర్స్ స్టేష‌న్ లో ల్యాండ్ అయ్యారు. అక్క‌డ నుంచి వీరు ఎంఐ వీఎఫ్ హెలికాప్ట‌ర్ లో వెల్లింగ్ట‌న్ కు బ‌యలుదేరారు. మార్గ‌మ‌ద్యంలోనే ఈ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదానికి గురైంది. చెట్టుకు గుద్దుకుని మంట‌ల‌తో కూలిపోయింది. ప్ర‌త్య‌క్ష సాక్ష్యులు చెప్పిన దాని ప్ర‌కారం ప్ర‌మాదం స‌మ‌యంలోనే హెలికాప్ట‌ర్ నుంచి కొంత మంది కింద‌ప‌డిపోయారు. కేవ‌లం ఐదు నిమిషాల వ్య‌వ‌దిలో హెలికాప్ట‌ర్ ల్యాండ్ అవ్వాల్సిన స‌మ‌యంలో ప్ర‌మాదం చోటుచేసుకోవ‌టం విషాదం నింపింది.

ఇదిలా ఉంటే భారత దేశపు మొట్టమొదటి చీఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ అధికారి బిపిన్‌ రావత్‌ బయో వార్‌ ముప్పు గురించి ప్రకటించిన మరుసటి రోజే హెలికాప్టర్‌ ప్రమాదంలో చిక్కుకున్నారు. డిసెంబరు 20 నుంచి 22 వరకు పూనేలో బంగ్లాదేశ్‌, నేపాల్‌, మయన్మార్‌, భూటాన్‌, థాయ్‌లాండ్‌, శ్రీలంక, ఇండియా) దేశాల కూటమి బిమ్స్‌టెక్‌ ఆధ్వర్యంలో విపత్తు నిర్వాహాణకు సంబంధించి పానెక్స్‌ 21 సదస్సు జరగనుంది. దీనికి కర్టెన్‌ రైజర్‌ కార్యక్రమం మంగళవారం న్యూఢిల్లీలో జరిగింది. ఇందులో సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచం మొత్తం ప్రమాదంలో పడిందన్నారు. కరోనా విపత్తు సమయంలో సాయుధ బలగాలు శ్రమించి పని చేశాయన్నారు. అయితే రాబోయే రోజుల్లో ప్రపంచానికి బయోవార్‌ ముప్పు ఉందనింటూ రావత్‌ హెచ్చరించారు. బయోవార్‌ ఇప్పుడిప్పుడే ఓ రూపు తీసుకుంటోందన్నారు. ఈ బయోవార్‌ని కలిసికట్టుగా ఎదుర్కొవాలంటూ బిమ్స్‌టెక్‌ దేశాలకు పిలుపునిచ్చారు. ఇందుకోసం పరస్పర సహాకారం అందించుకోవాలని సూచించారు.

Next Story
Share it