Telugu Gateway
Top Stories

శాంసంగ్‌ ను దాటేసిన యాపిల్

శాంసంగ్‌ ను దాటేసిన  యాపిల్
X

భారత్ ఫోన్ల ఎగుమతి లో కొత్త రికార్డు నెలకొల్పింది. ఒక్క నెలలోనే ఇండియా నుంచి ఒక బిలియన్ అంటే భారతీయ కరెన్సీలో 8000 కోట్ల రూపాయలకు పైగా విలువైన యాపిల్ ఫోన్లను ఎగుమతి చేశారు. ఈ రికార్డు 2022 సంవత్సరం డిసెంబర్ లో నమోదు అయింది. ఇండియా నుంచి ఇంత భారీమొత్తంలో స్మార్ట్ ఫోన్లు ఎగుమతి చేసిన కంపెనీ కూడా యాపిల్ కావటం విశేషం. దేశం లోని తమిళనాడు, కర్ణాటక తదితర ప్రాంతాల్లో యాపిల్ వివిధ రకాల యాపిల్ ఫోన్లను తయారు చేస్తోంది. ఇందులో ఐ ఫోన్ 12 , 13 తో పాటు ఐ ఫోన్ 14 కూడా ఉంది. దేశం నుంచి ఫోన్లు ఎగుమతి చేసే వాటిలో యాపిల్ మొదటి స్థానంలో ఉంది. ఇటీవల వరకు శాంసంగ్‌ మొదటి స్థానంలో ఉండేది. ఇప్పుడు ఆ ప్లేస్ ను యాపిల్ ఆక్రమించింది. 2023 మార్చితో ముగిసే కాలానికి దేశం నుంచి స్మార్ట్ ఫోన్ల ఎగుమతులు 72000 కోట్ల రూపాయలకు చేరతాయని అంచనా.

ఒక్క డిసెంబర్ లోనే అన్ని కంపెనీల స్మార్ట్ ఫోన్ ఎగుమతులు పది వేల కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. దేశం నుంచి స్మార్ట్ ఫోన్లను ఎగుమతి చేస్తున్న వాటిలో యాపిల్, శాంసంగ్‌ లు టాప్ ప్లేస్ లు సాధించాయి. భారత్ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ ) పథకం కింద ఈ కంపెనీలు ఇండియాలో తమ తమ ఫోన్ల తయారీ ప్రారంభించాయి. భారత్ ను స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ హబ్ గా మార్చాలనే లక్ష్యం తో కేంద్రం ఈ పథకం తెచ్చింది. తయారీదారులు పెట్టుబడులతో పాటు ఎగుమతులు,ఉద్యోగాలు వంటి వివరాలను ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది.

Next Story
Share it