జో బైడెన్ గెలుపు ధృవీకరించిన అమెరికా కాంగ్రెస్
అమెరికాలో అనూహ్య పరిణామాల మధ్య కాంగ్రెస్ జో బైడెన్ గెలుపును ధృవీకరించింది. ఎన్నడూలేని రీతిలోఎన్నో అడ్డదారులు తొక్కేందుకు ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన చివరి ప్రయత్నాలు కూడా విఫలం అయ్యాయి. అంతే కాదు..ట్రంప్ అమెరికాలో చరిత్రలో తనకో చీకటి అధ్యాయాన్ని లిఖించుకున్నట్ల అయిందనే విమర్శలను మూటకట్టుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా ట్రంప్ చర్యలపై విస్మయం వ్యక్తం అవుతోంది. అసలు ఇది అమెరికానేనా అన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఎలక్ట్రోరల్ కాలేజీ ఓట్లను లెక్కించి విజేతను అధికారికంగా ప్రకటించే ఉమ్మడి కాంగ్రెస్ సమావేశానికి ఆ దేశ ఉపాధ్యక్షుడైన మైక్ పెన్స్ నేతృత్వం వహించారు. చివరకు ట్రంప్ మైక్ పెన్స్ ను ఉపయోగించుకుని ఫలితాల్లో మార్పులు చేయాలని ప్రయత్నించారు. చట్టబద్ధంగా లభించిన ఎలక్ట్రోరల్ ఓట్లను పరిగణించకుండా చేసే అధికారం తనకు లేదని ప్రకటించారు.
ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిగా రాజ్యాంగానుసారం వ్యవహరిస్తానని ప్రమాణం చేశాను..అలాగే చేస్తాను అంటూ ప్రకటించారు. అన్నట్లుగా ఆయనే జో బైడెన్ గెలుపు ను ధృవీకరించారు. దీంతో మైక్ పెన్స్ ఇమేజ్ చరిత్రలో నిలిచిపోగా...ట్రంప్ మాత్రం అప్రతిష్టను మూటకట్టుకున్నారు. అమెరికా కాంగ్రెస్ ధృవీకరణ కూడా పూర్తి కావటంతో జో బైడెన్ ఈ నెల 20 ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి మార్గం సుగమం చేసింది. ఇక ఎన్నికల్లో డెమొక్రాట్లకు మద్దతుగా 306 ఓట్లు.. రిపబ్లికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు మద్దతుగా 232 ఓట్లు వచ్చాయని ఎలక్టోరల్ కాలేజీ ప్రకటించింది. రిపబ్లికన్ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఈ ఫలితాన్ని ధ్రువీకరించారు. ఇక అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన ట్రంప్, బైడెన్ గెలుపును ఇటీవల వరకూ అంగీకరించలేదు. అయితే తాజాగా అధికార మార్పిడికి అంగీకరిస్తానని ప్రకటించారు.
అంతకు ముందు అధికార మార్పిడికి అడుగడుగునా అడ్డుపడ్డారు. ఈ క్రమంలో బైడెన్ గెలుపును అధికారికంగా ధ్రువీకరించేందుకు భేటీ అయిన కాంగ్రెస్ సభ హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. అగ్రరాజ్యం రాజధాని వాషింగ్టన్ డిసీలోని క్యాపిటల్ భవన్ ముందు ఘర్షణ చెలరేగింది. ట్రంప్ మద్దతుదారులు పెద్ద ఎత్తున పార్లమెంట్‌కు చొచ్చుకెళ్లెందుకు ప్రయత్నించారు. భవనంలోని అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేసిన రణరంగాన్ని సృష్టించారు. బైడెన్ ఎన్నికను వ్యతిరేకిస్తూ ట్రంప్ మద్దతుదారుల ఆందోళనకు దిగడం ఒక్కసారిగా కలకలం రేపింది.