భారత్ పై బైడెన్ సంచలన వ్యాఖ్యలు
ఉక్రెయిన్ పై అన్యాయంగా దాడులకు తెగబడుతున్న రష్యా విషయంలో భారత్ తీరును అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ తప్పుపట్టారు. ఈ విషయంలో ఢిల్లీ ఎందుకో మెతకవైఖరితో, బలహీనంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. పలు అంతర్జాతీయ వేదికల మీద సైతం భారత్ ఈ విషయంలో తటస్థ వైఖరిని ఎంచుకుంటూ వస్తోంది. ఒక్క అంతర్జాతీయ న్యాయస్థానంలో మాత్రం రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేసింది. మిగిలిన అన్ని వేదికల మీదా మా మార్గం తటస్థమే అని చెబుతోంది. చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది.ఈ తరుణంలో అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అమెరికా మిత్రదేశాలు అన్నీ ఐక్యంగా ఉండి రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తుంటే...భారత్ మాత్రం ఎందుకో భిన్నంగా వ్యవహరిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. సీఈవోలతో జరిగిన సమావేశంలో జో బైడెన్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. నాటోను విభజించగలననే పుతిన్ లెక్కలు తప్పాయన్నారు. ఉక్రెయిన్ తో పోరు విషయంలోనూ ఆయన అంచనాలు తప్పాయన్నారు. పుతిన్ గురించి తనకు బాగా తెలుసన్నారు.
క్వాడ్ కూటమిలోనూ జపాన్, ఆస్ట్రేలియా కూడా రష్యా విషయంలో కఠినంగానే వ్యవహరిస్తున్నాయని తెలిపారు. ఉక్రెయిన్ పై రష్యా దాడులు ప్రారంభించి దాదాపు నెల కావస్తున్నా ఇంత వరకూ రష్యా ఆశించిన ఫలితం రాలేదు. పైగా దీని వల్ల అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. రష్యా ఆర్ధిక వ్యవస్థ తీవ్ర సమస్యలో కూరుకుపోతోంది. పలు అగ్రదేశాలు విధించిన ఆంక్షలే ఇందుకు కారణం అవుతున్నాయి. దీంతో పుతిన్ పై కూడా రష్యాలో తీవ్ర ఒత్తిడి ఎదరువుతోంది. అయితే ఈ సమస్యకు ఆయన ఎప్పుడు, ఎలా సహేతుక ముగింపు పలుకుతారన్నది ఆసక్తికరంగా మారింది. పుతిన్ కు అత్యంత సన్నిహితులు అయిన బడా బడా పారిశ్రామికవేత్తలు సైతం దేశం వదిలిపెట్టి పోతుండటంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారుతోంది. అయితే తాజాగా జో బైడెన్ చేసిన వ్యాఖ్యలపై భారత్ ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే.