Telugu Gateway
Top Stories

అమెరికా కొత్త నినాదం 'స్టే హోమ్'

అమెరికా కొత్త నినాదం స్టే హోమ్
X

అమెరికాలో కరోనా కేసులు మళ్ళీ అనూహ్యంగా పెరుగుతున్నాయి. లక్షల సంఖ్యలో కొత్త కేసులు వస్తుండటంతో పలు రాష్ట్రాల్లో ఆస్పత్రులు కూడా నిండిపోతున్నాయి. ఇటీవలే ముగిసిన ఎన్నికలు..అంతకు ముందు సాగిన ప్రచార సభలు వంటి రకరకాల కారణాలతో అమెరికాలో కేసుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతోపలు రాష్ట్రాలకు చెందిన నేతలు ఇంట్లోనే ఉండండి (స్టే హోమ్) నినాదాన్ని అందుకున్నారు. పెరుగుతున్న కరోనా వైరస్ ను నియంత్రించటానికి ఇదే మార్గం అని వారు ప్రజలకు సూచిస్తున్నారు. ఇప్పటికే వైరస్ పెద్ద ఎత్తున వ్యాప్తి చెంది ఉన్నందున ఇదొక్కటే మార్గం అని సూచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు వచ్చే రెండు వారాల పాటు ఎవరికి వారు స్వచ్చందంగా ఇంట్లో ఉండేందుకు సిద్ధం కావాలని నెవడా గవర్నర్ స్టీవ్ సిసోలక్ కోరారు. డిన్నర్లు, పార్టీలు, ఇతర కార్యక్రమాల పేరుతో గుమికూడవద్దని సూచించారు. విస్కోన్సిన్ గవర్నర్ కూడా ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఇళ్ళలోనే ఉండాలనే ఆదేశాలపై ఆయన సంతకం చేశారు. బయటకు వెళ్ళటం ఏ మాత్రం సురక్షితం కాదని, హ్యాపీ అవర్స్, డిన్నర్ పార్టీలు వంటి వాటికి చెక్ పెట్టాలని సూచించారు. ఇలాగే పార్టీలు చేసుకుంటూ పోతే వైరస్ పెరిగి మరో షట్ డౌన్ ప్రకటించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

అమెరికన్లు సురక్షిత చర్యలు అయిన మాస్క్ లు ధరించటం, సోషల్ డిస్టెన్సింగ్ వంటి నిబంధనలు పాటించకపోతే పరిస్థితి రాబోయే రోజుల్లో మరింత దారుణంగా మారే అవకాశం ఉందని ప్రజారోగ్య అధికారులు హెచ్చరించారు. అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ లు బాధ్యతలు చేపట్టే సమయం 2021 నాటికి పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ లెక్కల ప్రకారం అమెరికాలో ఇప్పటివరకూ 10.2 మిలియన్ల కేసులు నమోదు కాగా 2,39,000 మంది మరణించారు. అమెరికాలోని 44 రాష్ట్రాలు గత వారం కంటే ఈ వారంలో పది శాతం ఎక్కువ కేసులు నమోదు చేసినట్లు సీఎన్ఎన్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ వారంలోనే ఒక్క టెక్సాన్ రాష్ట్రంలో ఏకంగా పది లక్షల కేసులు నమోదు అయ్యాయన్నారు. కాలిఫోర్నియాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

Next Story
Share it